షాద్‌నగర్/తుక్కుగూడ/వికారాబాద్: వివిధ రకాల పథకాలు, కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్‌ఎస్ కావాలా.. స్కాంలతో ప్రజాధనాన్ని లూటీ చేసే కాంగ్రెస్ కావాలా? ప్రజలే ఆలోచించుకోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అమలు సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. గురువారం ఆయన షాద్‌నగర్‌లో ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ చేశారు. గిరిజన బంజారా భవన్‌ను ప్రారంభించారు. అనంతరం పట్టణ శివారులోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అలాగే వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో, మహేశ్వ రం మండలం రావిర్యాలలో విజయ డెయిరీని ప్రా రంభించిన సందర్భంగానూ మంత్రి మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్‌లకు దండిగా డబ్బుల మూటలు
దేశాన్ని యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వాది అయిన రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇచ్చారని.. ఈ గాడ్సే బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ఆరోపించారు. పంజాబ్‌కు సీఎంగా ఉన్న కెప్టెన్ అమరేందర్‌సింగ్ ఆనాడే ఈ విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాం«దీకి లేఖ రాశారని గుర్తు చేశారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌కు కర్ణాటక నుంచి, బీజేపీకి అదానీ సంస్థల నుంచి డబ్బుల మూటలు వస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు పంపిణీ చేసి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ 2014లో 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారని కానీ ఇప్పటివరకు ఏ రైతు ఆదాయం కూడా డబుల్ కాలేదని ఎద్దేవా చేశారు. షాద్‌నగర్ సమీపంలోని సిద్దాపూర్‌లో 330 ఎకరాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
పాడిపంటలకు సీఎం ప్రోత్సాహం
రాష్ట్రంలో పాడి పంటలను సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. గత పాలకులు ప్రభుత్వ అ««దీనంలో ఉన్న విజయ డెయిరీని పట్టించుకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పాడి రైతులకు లీటర్‌కు రూ.4 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తోందని, ఇప్పటివరకు రూ.350 కోట్ల బోనస్ రైతులకు చెల్లించిందని తెలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పి.సబితాఇంద్రారెడ్డి, పి. మహేందర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్, నవీన్ పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఘర్ కే వాస్తే పైసే దియా క్యా
‘ఘర్ కే వాస్తే కిసీకూ పైసే దియా క్యా’..? (ఇంటి కోసం ఎవరికైనా డబ్బులిచ్చారా?) అంటూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ సందర్భంగా కేటీఆర్ లబి్ధదారులను ఆరా తీశారు. లబి్ధదారు రహానా మాట్లాడుతూ.. ‘ఏక్ పైసా బీ కిసీకూ నై దియా.. బీస్ పచ్చీస్ లాక్‌కా ఘర్ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సాబ్‌నే హమారేకు దియా‘(ఎవరికీ పైసా ఇవ్వలేదు. 20–25 లక్షల విలువైన ఇంటిని సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాకిచ్చారు) అని చెప్పారు.
కోడలమ్మ మంచిగా చూసుకుంటోంది సార్..
సీఎం కేసీఆర్ రూ.2 వేల వృద్ధాప్య పెన్షన్ ఇస్తుండటంతో కోడలమ్మ తనను బాగా చూసుకుంటోందని ఆసరా పెన్షన్ లబ్ధిదారు సరోజనమ్మ తనను పలుకరించిన మంత్రి కేటీఆర్‌తో చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment