
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు ప్రజా తీర్పును చూసి ఓర్చుకోలేక పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. లోకేష్ విశాఖలో మాట్లాడిన మాటలు సిగ్గు చేటన్నారు. పంచాయతీ ఎన్నికల మొదటి, రెండో విడత ఫలితాలు చూశాక తండ్రీకొడుకులకు మతిభ్రమించిందని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈవీఎంలు వద్దు బ్యాలెట్‌లు పెట్టాలన్న చంద్రబాబుకు పంచాయతీల బ్యాలెట్ ఫలితాలు చెంపపెట్టులా మారాయి. టీడీపీలో ఉంటే మునిగిపోతామని తెలుసుకున్న నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. 2017లో ఆర్ధిక మంత్రి జైట్లీ.. విశాఖ ఉక్కు పెట్టుబడుల ఉపసంహరణపై ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ, బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్న నాడు విశాఖ ఉక్కు పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చుట్టారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఒక్క లేఖ రాయలేదు. ( స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్ వివరించాం: సోము )
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. మూడు ప్రత్యామ్నాయ మార్గాలు చూపారు. విశాఖ ఉక్కు అంశంలో టీడీపీ వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏపీలో ప్రజలు తిరస్కరిస్తారనే చంద్రబాబు హైదరాబాద్‌లో నివాసం కట్టుకున్నారు. జయంతికి, వర్ధంతి తేడా తెలియని...లోకజ్ఞానం లేని వ్యక్తి లోకేష్. గతంలో అనేక సార్లు టీడీపీ వ్యతిరేక విధానాలపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి వైఎస్ జగన్. ఎవరి దీక్షకో మద్దతు ఇవ్వడం కాదు లోకేష్! నువ్వు దీక్ష చేయ్.. ఒళ్లు తగ్గుతుంది. ముఖ్యమంత్రి నాయకత్వంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటాము. ప్రజల కోసం వైఎస్సార్ సీపీ ఎటువంటి త్యాగాలకైనా సిద్దంగా ఉంది’’ అని అన్నారు.