సాక్షి, భీమవరం/ భీమవరం ప్రకాశం చౌక్/తణుకు అర్బన్/తాడేపల్లిగూడెం అర్బన్/ సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ జనంపై దండయాత్ర చేస్తున్నారు. భీమవరంలో మంగళవారం రాత్రి తన వెంట తెచ్చుకున్న టీడీపీ రౌడీమూకను జనంపై దాడులకు ఉసిగొల్పారు. సామాన్యుల ఇళ్లలోకి వెళ్లి దొరికిన వారిని దొరికినట్లుగా కొట్టించారు. వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా చితకబాదించారు. మరోవైపు టీడీపీ మూక వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కూడా విరుచుకుపడింది. సర్దిచెప్పడానికి వచ్చిన పోలీసులను కూడా వదలకుండా రౌడీ మూక దాడులు చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు సహా 16 మంది గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ శివారు బ్రిడ్జిపేట, ఇందిరమ్మకాలనీ వాసులు మంగళవారం రాత్రి లోకేశ్ పాదయాత్ర చూడటానికి వారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిలుచున్నారు.
అదే సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి బ్యానర్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, వాటర్ బాటిల్ విసిరారు. విషయం తెలుసుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొందరు అక్కడ నిరసన తెలియజేస్తుండగా టీడీపీ యువగళం సేన రాళ్లు రువ్వుతూ ఒక్కసారిగా రెచ్చిపోయింది. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆ చుట్టు పక్కల ఉన్న ఇళ్ల వైపు పరుగులు తీశారు. వారిని వెంటాడి డ్రోన్ ప్లే సహాయంతో వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని రౌడీ మూక రాళ్లతో దాడి చేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న మహిళలు, వృద్ధులను కూడా కనికరించకుండా వారిపైనా రాళ్లు రువ్వారు. దీంతో పలువురు మహిళలు, వృద్ధులు గాయపడ్డారు.
ఇంత జరుగుతుంటే ఆపాల్సింది పోయి.. లోకేశ్ ఆ రౌడీ మూకను మరింతగా రెచ్చగొట్టేలా సలహాలు, సూచనలు ఇవ్వడం గమనార్హం. ఈ దాడికంతటికీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి నేతృత్వం వహించారు. ఈ దాడిలో గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. బెంజిమెన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో ఏలూరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడ్డ వారిని బుధవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ టీడీపీ వైఖరిపై దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఉనికి కోసం కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
రాళ్ల దాడి దారుణం
యువగళం పేరుతో నారా లోకేశ్ తన పాదయాత్రలో ఆద్యంతం దాడులే లక్ష్యంగా ముందుకు సాగుతుండటం దారుణం. భీమవరంలో రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించాం. ఉనికి కోసమే టీడీపీ నేతలు ఇలా గొడవలు సృష్టిస్తున్నారు .– కొయ్యే మోషేన్‌రాజు, శాసనమండలి చైర్మన్
భయపడిపోయాం..
‘మాకు గొడవలతో ఏ సంబంధం లేదు. ఎర్ర టీ షర్టులు వేసుకున్న వారు ఒక్కసారిగా రాళ్లు విసరడంతో నా చేతికి, తలకు గాయమైంది. చేతికి, తలకు కుట్లు పడ్డాయి’ అని బ్రిడ్జిపేటకు చెందిన దాసరి ఎలీషా ఆవేదన వ్యక్తం చేసింది. ‘కొందరు మా ఇంట్లోకి వెళ్లడంతో బయట ఉన్న మాపై దాడి చేశారు. మా ఇద్దరికీ ఛాతీ, తొడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి’ అని బ్రిడ్జిపేటకు చెందిన దంపతులు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ చెప్పారు. ‘రాళ్ల దాడి నుంచి కాపాడుకోవడానికి నా బిడ్డను పైనుంచి కిందకు జనంలోకి విసిరేశాను. కొందరు యువకులు పట్టుకుని కాపాడారు. నేను పరుగులు తీశాను. మా అత్త గాయపడింది. భయపడిపోయాం’ అని గరికపాటి లావణ్య గద్గద స్వరంతో చెప్పింది.
రాష్ట్రంలో మారణకాండే వారి లక్ష్యం
సభలు, పాదయాత్రల పేరుతో తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా మారణకాండ సృష్టిస్తున్నారు. పుంగనూరు దాడి తరహాలోనే భీమవరంలోనూ ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులను టార్గెట్ చేసుకుని దాడికి దిగారు. ఇళ్లలోకి వెళ్లి మరీ ప్రజలపై దాడి చేయడం దారుణం. గత ఎన్నికల్లో అధికారం ఇవ్వని ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు. లోకేశ్ నోటి దురుసే గొడవలకు దారి తీస్తోంది. దగ్గరుండి మరీ గొడవలకు ఆజ్యం పోస్తున్నారు.
ఎవరిపై ఎక్కువ కేసులుంటే వారికే రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతుండటం దుర్మార్గం. టిడ్కో ఇళ్ల స్కాంలో భాగంగా రూ.118 కోట్లు దోచుకున్న చంద్రబాబు నోటీసులపై ఎందుకు నోరు మెదపడం లేదు? వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని వివిధ రంగాల నిపుణులు గణాంకాలతో సహా వెల్లడిస్తుంటే తండ్రీకొడుకులకు నిద్ర కరువైంది. – కారుమూరి నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి
ప్రతిష్ట కోల్పోవడంతోనే ప్రజలపై దాడులు
ప్రజల్లో టీడీపీ ప్రతిష్ట కోల్పోవడం వల్లే చంద్రబాబు, లోకేశ్‌లు ఆయాచిత ప్రచారం కోసం ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. భీమవరం ఘటనకు వారే పూర్తి బాధ్యత వహించాలి. భీమవరంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ చింపేసినా సంయమనం పాటించాం. మేము అనుకుని ఉంటే పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీ ఒక్కటి కూడా ఉండేది కాదు. ఎల్లో మీడియా అండ చూసుకుని లోకేశ్ నోరు పారేసుకుంటున్నారు. అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను దోచుకున్నానని చెబుతున్న రూ.52 కోట్లు, 100 ఎకరాల భూమి ఎక్కడుందో చెబితే లోకేశ్‌కు దండం పెడతా.
లోకేశ్ వెంట ఉన్న వారిలో చాలా మంది దొంగనోట్ల మార్పిడి నేతలేనని అందరికీ తెలుసు. బ్యాంకు రుణం తీసుకుని నేను ఇల్లు కట్టుకుంటుండటం తప్పా? భీమవరంలో అభివృద్ధి టీడీపీని కలవరపెడుతోంది. వారి హయాంలో ఒక్క పనీ చేయలేదు. ఇప్పుడు మేము చేస్తుంటే కోర్టులో కేసులు వేయిస్తూ అడ్డుకుంటుండటం దారుణం. 60 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్, టిడ్కో ఇళ్లు, తాడేరు వంతెన, ఓల్డ్ యనమదుర్రు డ్రెయిన్ నిర్మాణం, సోమగుండం ఔట్‌లెట్, చెరువు అభివృద్ధి చేశాం. రూ.32 కోట్లతో యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెనకు అప్రోచ్ రోడ్డు, జిల్లా కేంద్రంగా భీమవరం ఏర్పాటు.. తదితర పనులన్నీ మేము చేసినవే. – గ్రంధి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే
రక్తపాతంతో లబ్ధి పొందాలని కుట్ర
నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టిస్తోంది. ప్రజలపై, పోలీసులపై దాడులు చేసి రక్తపాతం సృష్టించేలా కుట్ర పన్నారు. దౌర్జన్య కాండతో కూడిన యాత్రలు నిర్వహిస్తే జైలు పాలవడం ఖాయం. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, ప్రజల జీవన వి«ధానం, పాడి పంటలు.. ఇవేవీ లోకేశ్‌కు పట్టవు. దౌర్జన్యాలు చేయడానికే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నట్లుంది.
పాద యాత్రను చూడటానికి రావడమే మహిళలకు శాపమైందా? లోకేశ్ దౌర్జన్య కాండపై ప్రజలు తిరగబడితే ప్రభుత్వమే తనపై దాడి చేయిందని ప్రచారం చేసేందుకు కుట్ర చేశారు. ఇందుకు పచ్చ మీడియా వంత పాడుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సీఎం ఫ్లెక్సీలు కనిపిస్తే చింపేయండని తన వర్గీయులను రెచ్చగొడుతున్న లోకేశ్ నేరస్తుడు, రక్తపిశాచి, సైకోలా తయారయ్యాడు. చంద్రబాబు బండారం బట్టబయలైంది. త్వరలోనే జైలుకు వెళతాడు. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి
సంఘ విద్రోహ శక్తులకు చంద్రబాబు గాడ్‌ఫాదర్
విద్యార్థి దశ నుంచి హత్యా రాజకీయాలను ఒంట బట్టించుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంఘ విద్రోహక శక్తులకు గాడ్‌ఫాదర్‌గా, గూండాలు, మాఫియాకు డాన్‌గా మారారు. టీడీపీని తెలుగు మాఫియా పార్టీగా మార్చారు. ఆ పార్టీ గూండాలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడానికి కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొన్న పుంగనూరులో, నిన్న భీమవరంలో పోలీసులపై దాడులు చేయించారు.
విజయవాడ నడిబొడ్డున వంగవీటి రంగాను గూండాలతో హత్య చేయించిన చంద్రబాబు.. మల్లెల బాబ్జీ నుంచి వైఎస్సార్‌సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి వరకూ ఎందరినో హత్య చేయించారు. తన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కుంపట్లు రాజేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేకే అలజడులు సృష్టిస్తున్నారు. బాబుకు సిగ్గు లజ్జ ఉంటే.. రూ.118.98 కోట్లకు ఐటీ శాఖకు లెక్కలు చెప్పాలి. – టీజేఆర్ సుధాకర్ బాబు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment