కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం | Mamata Banerjee Says Wont Allow Centre Proxy Control Of Government | Sakshi
Sakshi News home page

కేంద్రంపై మండిపడ్డ మమతా బెనర్జీ

Published Thu, Dec 17 2020 4:32 PM | Last Updated on Thu, Dec 17 2020 7:00 PM

Mamata Banerjee Says Wont Allow Centre Proxy Control Of Government - Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. బెంగాల్‌ నుంచి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను వెనక్కి రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేస్తున్నాయన్నారు. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై బెంగాల్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ విధుల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ ఆ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌పై రావాలంటూ శనివారం సమన్లు జారీ అయ్యాయి.

ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన సీఎం మమత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అప్రజాస్వామిక శక్తులు, విస్తరణవాద కాంక్షతో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి ముందు పశ్చిమ బెంగాల్‌ ఎన్నడూ తల వంచదు. రాష్ట్ర యంత్రాంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ఈ విధానాన్ని మేం ఒప్పుకోము. బెంగాల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యుటేషన్‌పై రమ్మన్న భారత ప్రభుత్వ ఆదేశాలపై మా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐపీఎస్‌ కేడర్‌ రూల్‌ 1954లోని ఎమర్జెన్సీ ప్రొవిజన్‌ ప్రకారం ఈ ఆదేశాలు, అధికార దుర్వినియోగాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 

ఇది.. రాష్ట్ర న్యాయ వ్యవస్థపై దురాక్రమణ వంటిది. ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. రాజ్యాంగ వ్యతిరేకం. ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు. ఈ చర్య అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని మమత కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా ఐపీఎస్‌ అధికారులు భోలనాథ్‌ పాండే (డైమండ్‌ హార్బర్‌ ఎస్పీ), ప్రవీణ్‌ త్రిపాఠి (డీఐజీ, ప్రెసిడెన్సీ రేంజ్‌), రాజీవ్‌ మిశ్రా (ఏడీజీ, సౌత్‌ బెంగాల్‌)  నడ్డా బెంగాల్‌ పర్యటనకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.(చదవండి: ఎమ్మెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement