న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొత్తం 70 స్థానాల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని అన్నారు.
రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బీజేపీపై మాటల దాడి చేశారు. తనను, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి, జైలులో పెట్టారని ఆరోపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాను చేపడుతున్న ప్రచారంలో తనకు లభించిన అభిమానాన్ని సిసోడియా గుర్తు చేసుకుంటూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, మొత్తం ఓట్లలో 70 శాతం ఓట్లు సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
తాను ఏ తప్పూ చేయలేదు. అందుకే జైలు నుంచి నవ్వుతూ బయటకు వచ్చాను. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌తో సహా అనేక ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని, తమ నాయకులపైకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను పంపడం ద్వారా పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిందన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం బెదరకుండా మరింత బలం పుంజుకున్నదని అన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే మన మధ్యకు వస్తారని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి 17 నెలలు తీహార్ జైలులో గడిపిన మనీష్ సిసోడియా ఈ నెల ప్రారంభంలో విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment