
సాక్షి, అమరావతి: అమరావతిలో టీడీపీ చేసిన భూకుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్న కుట్రతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి చంద్రబాబు చేస్తున్న కుట్రపూరిత ఆలోచనలను ప్రజలకు తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి సుచరిత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే...
► ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఇస్తే విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రిగా తాను, డీజీపీ కోరి 24 గంటలు గడిచినప్పటికీ ఇంతవరకూ చంద్రబాబు స్పందించనే లేదు. అమరావతి భూకుంభకోణాలపై పోలీసులు సమగ్రంగా విచారించి పూర్తి ఆధారాలతో నివేదిక రూపొందించబోతున్న తరుణంలో చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. చంద్రబాబు, ఆయన బినామీలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అమరావతి భూకుంభకోణాల నుంచి తప్పించుకోలేరు.
► చంద్రబాబు తనకున్న పరిచయాలు, తనకు సహకరించే వారిని ఉపయోగించుకుని కొన్ని మీడియా సంస్థలతో కలిసి కుట్ర చేస్తున్నారు.
► పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే వారిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు.
► ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.