పెదనందిపాడు/గుంటూరు రూరల్: ‘నాడు వైఎస్సార్ భిక్షతోనే రాజకీయాల్లోకొచ్చి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరిన మొట్టమొదటి వ్యక్తిని నేనే’ అని మాజీ హోం మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా నాగులపాడు వ్యవసాయ మార్కెట్ యార్డు అవరణలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్టు చేస్తున్న ప్రచారాలు అవాస్తవమన్నారు.
రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని స్పష్టం చేశారు. తనపై కొన్ని మీడియా చానళ్లు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని, ఏమైనా సందేహాలుంటే తనను సంప్రదించాలని, అలా కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తే ఎలా.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారే ఆలోచనే లేదని, దుష్ప్రచారాలను మానుకోవాలంటూ ఆయా చానళ్లకు హితవు పలికారు.
‘మా ప్రతి అడుగూ జగనన్నతోనే’..
వైఎస్సార్ ఆశయాలను అమలు చేస్తున్న జననేత సీఎం జగనన్నతోనే మా ప్రతి అడుగూ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త, ఇన్‌కంటాక్స్ మాజీ కమిషనర్ మేకతోటి దయాసాగర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉన్నానని, దానిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా, ఇతర పద్ధతులు ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నారు.. పార్టీ మారుతున్నారు.. అంటూ ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర సర్వీస్‌లో ఉద్యోగిగా పనిచేసిన తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం ఉండే అవకాశాలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment