పి.గన్నవరం: పేద విద్యార్థులు అందరికీ మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏటా విద్యారంగానికి రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. నాడు నేడు మొదటి విడత కార్యక్రమంలో రూ.3,600 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 15,715 పాఠశాలల రూపురేఖలను మార్చివేశామని వివరించారు. పి గన్నవరం ఉన్నత పాఠశాల నుంచి సీఎం జగన్ ప్రజలకు అంకితం చేయనున్నారని ప్రకటించారు.
ఈనెల 16వ తేదీన సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హైస్కూల్‌లో శనివారం అభివృద్ధి పనులు, సభ ప్రాంగణాన్ని మంత్రి సురేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌తో మాయ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ కబంధ హస్తాలు అందించిందని ఆరోపించారు.
ఇక రెండో విడతగా రూ.4,800 కోట్ల వ్యయంతో మరో 16 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమం కింద గతేడాది రూ. 650 కోట్లతో 42 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ అందించినట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోవడoతో కొత్తగా ఆరు లక్షల మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. వారందరికీ రూ.800 కోట్ల విలువైన జగనన్న కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment