
ఒంగోలు: ‘పవన్‌కళ్యాణ్ నిలకడలేని మనిషి. ఆయనకు ఒక సిద్ధాంతం, భావజాలం లేవు. ఆయన చేస్తున్నది రాజకీయంలా అనిపించడం లేదు. రాజకీయ వ్యభిచారంలా ఉంది’ అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ అన్నారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌కళ్యాణ్ ఒకవైపు బీజేపీతో అంటకాగుతూ.. మరోవైపు టీడీపీతో ఒప్పందంలో ఉంటారని విమర్శించారు.
ఆయన ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో కనీసం ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడం వల్లే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి వారు గుంపులు గుంపులుగా వచ్చినా.. వైఎస్ జగన్ నేతృత్వంలో 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామన్నారు. తాము చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకంతోనే గడప గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నామని.. ప్రభుత్వం ద్వారా వారికి చేకూరిన లబ్ధిని వివరిస్తున్నామని తెలిపారు.
ఇంకా ఏమైనా సమస్యలుంటే.. వాటిని తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి.. యువతను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు అండ్ కో.. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రూ.300 కోట్లకు పైగా సొమ్మును కాజేసిందని మండిపడ్డారు.