సాక్షి, విశాఖపట్నం: వలంటీర్లపై చంద్రబాబు కుట్రచేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్దితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని ఫైరయ్యారు.
కాగా, మంత్రి బొత్స ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు అనుచరులు వలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు లబ్ధిదారులకు పెన్షన్ ఎవరు ఇస్తారు?. ఇప్పటికి ఇప్పుడు వారికి బ్యాంక్ ఖాతాలు తెరిచి పెన్షన్ వేయాలంటే వీలు అవుతుందా?. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోంది. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే డీఎస్పీని ప్రకటించాం.
ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలను ఫాలో అవుతాం. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం డీఎస్పీ పరీక్ష నిర్వహిస్తాం. ప్రతిపక్షం తీరు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. సామాజిక సాధికారత ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ మొదలైంది. ఉత్తరాంధ్రలో అన్ని ఎంపీ స్థానాల్లో బలహీన వర్గాలకే వైఎస్సార్‌సీపీ అవకాశం కల్పించింది.
వారితో ఉత్తరాంధ్రతో ఏం సంబంధం..
బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఓసీలకు టీడీపీ కూటమి టికెట్లు ఇచ్చింది. ఒక్క వర్గం కిందనే ప్రజలంతా ఉండాలని చంద్రబాబు కోరుకుంటాడు. ఏ వర్గానికి చెందిన మేలు ఆ వర్గం వారే సాధించుకోవాలని సీఎం జగన్ ఆలోచన చేశారు. పవన్‌కు ఇచ్చిన రెండు ఎంపీ సీట్లు కూడా బీసీకి కేటాయించలేదు. బీజేపీ కూడా అదే పంధాలో వెళ్లింది. ఆయా పార్టీలకు ఉత్తరాంధ్ర ప్రజలపై చిన్నచూపు ఉంది కాబట్టే ఎక్కడో ఉన్న వారిని ఇక్కడ అభ్యర్థులుగా పెడుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు కాదనను. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి. వారికి ఈ ప్రాంతంలో సంబంధమే లేదు. ప్రశాంత ఉత్తరాంధ్ర వాతావరణాన్ని పాడు చేయడానికి లాభయిస్టులను తీసుకువచ్చి అభ్యుర్థులుగా పెడుతున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు.
స్టీల్ ప్లాంట్‌పై కూటమి ఏం చెబతుంది?
స్టీల్ ప్లాంట్ అంశం కేంద్ర పరిధిలోనిది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న పార్టీతో ఇప్పుడు ఎవరు కలిశారు. నాడు పాచిపాయిన లడ్డులు ఇచ్చారని అన్న పవన్ ఇప్పుడు వారితో కలిశాడు. స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు కూటమి ఏం చెప్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని బీజేపీ ప్రకటన చేయాలి.. ఇది మా డిమాండ్. స్టీల్ ప్లాంట్‌పై సమాధానం చెప్పకుండా వారు ఇక్కడ ప్రచారం చేయడానికి అర్హత లేదు.
సెక్యూరిటీ కోసమే బీజేపీతో పొత్తు..
ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుంది. చంద్రబాబు ఆయన కొడుకు భయపడి జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసుకున్నారు. ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారు. లోకేష్ కంటే నేను ఎక్కువ కాలం మంత్రిగా పని చేశాను. నాకెందుకు అంత సెక్యూరిటీ లేదు. బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment