కాంగ్రెస్‌ చేతికి వెళ్తే కుక్కలు చింపిన విస్తరే  | Minister Harish Rao at Siddipet Road Show | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ చేతికి వెళ్తే కుక్కలు చింపిన విస్తరే 

Published Wed, Nov 29 2023 4:10 AM | Last Updated on Wed, Nov 29 2023 4:10 AM

Minister Harish Rao at Siddipet Road Show - Sakshi

సిద్దిపేట జోన్, మద్దూరు: ‘కొంతమంది దొంగలు, తెలంగాణ ద్రోహులు ఓటు కోసం బయల్దేరారు. కాంగ్రెస్‌ వాళ్లు ఎప్పుడైనా తెలంగాణ కోసం పోరాటం, రాజీనామాలు, దీక్షలు చేసిండ్రా? అన్నీ చేసింది కేసీఆర్‌. తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌. కానీ ఇప్పుడు కుర్చీ మీద కూసోవడానికి వస్తుండ్రు. తప్పిపోయి రాష్ట్రం కాంగ్రెస్‌ చేతికి పోతే కుక్కలు చింపిన విస్తరే’ అని మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్‌ చేతుల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పారీ్టకి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని విమర్శించారు. వాళ్లు ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరని, ఎన్నికలున్నా లేకున్నా ఐదేళ్లు తాను ప్రజల మధ్య ఉంటానని హరీశ్‌ హామీ ఇచ్చారు.

కొందరు సిద్దిపేట అభివృద్ధి మీద విమర్శలు చేశారని, ఇక్కడి ప్రగతిని చూసి ఓర్వలేని వారికి, అభివృద్ధిని విమర్శించిన వారికి ఓటు రూపంలో సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతిసారీ తన మెజార్టీ పెంచుతూ ఎంతో ప్రేమను అందించిన సిద్దిపేటకు తన జీవితం అంకితమని హరీశ్‌ వ్యాఖ్యానించారు. 

యూపీలో చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా? 
’’ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన ప్రియాంకాగాంధీ 6 నెలలు రాష్ట్రం మొత్తం పర్యటిస్తే అక్కడ కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు 2 అని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా’’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా గనులు, భూగర్భ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ  కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో 2.5 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 180 రోజులు గడిచినా ఒక్క నోటిఫికేషన్‌ వేయలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్‌ సరిపోతుంది అంటున్నారు.. రైతులు ఆలోచించాలి.. రేవంత్‌రెడ్డి ఇవాళ టికెట్లు అమ్ముకున్నాడు.

అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడని ఆరోపించారు. సోనియాగాందీని బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో దేవత అంటున్నాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అతన్ని ప్రజలు నమ్మడం లేదని, పోటీ చేస్తున్న రెండు చోట్లా ఓడిపోతున్నాడని హరీశ్‌ జోస్యం చెప్పారు. 

కాంగ్రెస్‌ ది బలుపు కాదు.. వాపు గెలిచి నిలిచేది బీఆర్‌ఎస్సే: ‘ఎక్స్‌‘లో హరీశ్‌ రావు 
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ది బలుపు కాదు వాపు అని ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలు రుజువు చేశాయని మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎన్నికల ప్రచారానికి ఎంత మంది పొలిటికల్‌ టూరిస్టులు వచ్చినా రాష్ట్ర ప్రజలు సీఎం  కేసీఆర్‌కే బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు.

తెలంగాణలో గెలిచి నిలిచేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించిందని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌‘ లో పేర్కొన్నారు. ఈ నెల 30 న జరిగే పోలింగ్‌లో కేసీఆర్‌ పై తెలంగాణ ఏక పక్షంగా తన అభిమానాన్ని చాటుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మూడో సారి బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి, కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎం చేసేందుకు తెలంగాణ ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారని హరీశ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement