సాక్షి, హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ లక్ష్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో తనను కలవాల్సిందిగా ఎమ్మెల్యే రాజయ్యకు కేటీఆర్ సోమవారం సాయంత్రం ఫోన్ చేశారు.
ఆ మేరకు రాజయ్య మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటన లపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరస్పర విమర్శలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం.
ఇద్దరూ సీనియర్లు.. కలుపుకొని పోవాలి
మీడియాలో వస్తున్న వార్తలను కేటీఆర్ ప్రస్తావిస్తూ ‘రాజన్నా చేసింది చాలు.. ఎక్కువేం మాట్లాడకు.. సీఎంకు చెప్తా.. ఆయనే అన్నీ చూసుకుంటారు. మళ్లీ ఎక్కడా మాట్లాడొద్దు.. ఏమీ చెప్పొద్దు.. ఇద్దరూ సీనియర్లు.. కలుపుకునిపోవాలి. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా వేటు తప్పదు’ అని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాను పాల్గొన్న పల్లె నిద్ర, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను పుస్తకరూపంలో కేటీఆర్‌కు రాజయ్య అందజేశారు. కేవలం ఐదు నిమిషాల్లోనే కేటీఆర్‌తో రాజయ్య భేటీ ముగిసినట్లు తెలిసింది.
నాకే టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది
‘టికెట్ విషయాన్ని అధిష్టానం చూసు కుంటుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తా. కేటీఆర్ నాతో మాట్లాడిన తీరు చూస్తే టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. కడియంపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయాన్ని అధిష్టానం చూసుకుంటుంది’ అని రాజయ్య పేర్కొ న్నారు. తనపై స్థానికంగా వస్తున్న ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారని, ఆ ఆరోపణలు నిరాధారమనే విషయం పార్టీ నాయకత్వానికీ తెలుసన్నారు.
ఇకపై నా నోటి నుంచి కడియం పేరు ఉండదు
కేటీఆర్‌తో భేటీ అనంతరం అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లో నెలకొన్న సమస్య సద్దుమణిగింది. కేటీఆర్ పిలుపు మేరకు ప్రగతిభవన్‌కు వచ్చి అన్ని విషయాలు వివరించాను.
పార్టీ లైన్‌లో పనిచేయమని కేటీఆర్ ఆదేశించారు. 2018 ఎన్నికల సమ యంలోనూ కడియం శ్రీహరి ఇలాగే వ్యవహ రించారు. నియోజకవర్గాల్లో విభేదాలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు కేంద్రంగా పనులు జరగాలని కేసీఆర్ ఆదేశించినా కడియం పట్టించుకోలేదు.
ఇతర ఎమ్మెల్సీలు నన్ను అడిగి నిధులు కేటాయిస్తే కడియం మాత్రం గ్రూపులు ప్రోత్సహించేలా వ్యవహరించారు. కడియం శ్రీహరిపై నేను కొత్తగా మోపిన అభియోగాలేమీ లేవు. పాత వాటిని ఉటంకించాను. ఇప్పటికి ఈ వివాదం ముగిసిపోయిందని అనుకుంటున్నాను. నా నోటి నుంచి ఇకపై కడియం శ్రీహరి పేరు రాదు. కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తా’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment