
సాక్షి, అమరావతి: ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నేతన్నలకు చంద్రబాబు 50 పైసలైనా ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. బీసీల తలరాత మార్చిన నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. మంత్రుల్లో బీసీలకు పెద్దపీట వేశారని, 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీలకు ఇచ్చారని తెలిపారు.
చంద్రబాబు హయాంలో ఏమీ తెలియని వాళ్లని వేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులు, వైద్య రంగం నుంచి వ్యక్తులను పీసీబీలో వేస్తే తప్పా అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చేసే మంచి పనులకు రాక్షసుల్లా ఎందుకు అడ్డు పడుతున్నారని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. కేంద్రం చేసిన అప్పుల గురించి మాత్రం మాట్లాడరని, గతంలో పసుపు కుంకుమ కోసం చంద్రబాబు ఇతర శాఖల, కార్పొరేషన్ల నిధులు వాడారని మండిపడ్డారు.