సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోందని, అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీ స్కీంలంటూ మాయమాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌ను నమ్మితే ప్రజలకు మూడు గ్యారంటీలు మాత్రం పక్కాగా ఉంటాయన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పోవుడు, మూడు గంటల కరెంట్ వాపస్ వచ్చుడు గ్యారంటీగా జరుగుతుందన్నారు.
ఇక సంవత్సరానికి ఒక సీఎం చొప్పున ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు మారతారని పేర్కొన్నారు. సీల్డ్ కవర్‌లో ఢిల్లీ నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు దిగుతారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఆకాశం నుంచి పాతాళం దాకా ఏ టూ జెడ్ కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని అన్నారు. ‘ఓటుకు కోట్టు దొంగల చేతుల్లో ఉన్న ఆ పార్టీ ఇచ్చే హామీలకు గ్యారంటీ ఉందా?’అని ప్రశ్నించారు.
అది వారంటీ అయిపోయిన పార్టీ అని, అలాంటి పార్టీ ఇచ్చే హామీకి విలువ ఉంటుందా? ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. తొలుత ఆయన సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌తో పాటు పలు అభివృద్ధి పనులను మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నల్లగొండలో జరిగిన ప్రగతి నివేదన సభలోనూ పాల్గొన్నారు. ఈ రెండుచోట్లా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
అందరికీ అండగా ఉన్న మాది కుటుంబపాలనే..
‘ప్ర«దానమంత్రి నరేంద్రమోదీ చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది కుటుంబ పాలనగా విమర్శిస్తున్నారు. బరాబర్ మాది కుటుంబ పాలనే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబ పెద్ద కేసీఆర్. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్న సోదరుడు కేసీఆర్. 5 లక్షల మంది దళిత సోదరులకు దళితబంధు ఇచ్చి అండగా నిలిచింది కేసీఆరే. ఇన్ని రకాలుగా అందరికీ అండగా నిలబడ్డ కేసీఆర్‌ది తప్పకుండా కుటుంబ పాలనే..’అని కేటీఆర్ అన్నారు.
మోదీది గాడ్సే వారసత్వం
‘బీఆర్‌ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమని మరొకడు అంటున్నడు. మాది పక్కా వారసత్వ రాజకీయమే. రాణి రుద్రమదేవి రాజసత్వంలో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాది పక్కా కొమరంభీం, సర్వాయి పాపన్న, దళితజాతి వైతాళికుడు భాగ్యారెడ్డి వారసత్వం. బడుగు వర్గాలకు చేయూతనిచ్చేలా కులవృత్తులు, చేతి వృత్తులకు కొత్త ఊపిరినిచి్చన వారసత్వ ప్రభుత్వం మాది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల వారసత్వం మాది. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని చెప్పిన దాశరథి, కాళోజీ సాంస్కృతిక వారసత్వం మాది. మాది గాంధీ వారసత్వం అయితే.. మాపై మాట్లాడుతున్న మోదీ గారిది గాం«దీని చంపిన గాడ్సే వారసత్వం..’అని మంత్రి ధ్వజమెత్తారు.
ఈ ప్రధాని తొమ్మిదేళ్లలో చేసిందేముంది?
‘రాష్ట్రానికి వచి్చన ప్రధాని మోదీ చెప్పే అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. కేసీఆర్ రైతురుణ మాఫీ చేయలేదని, అందుకే రైతులు చనిపోయారంటూ ఒక ప్రధానిగా ఉండి అబద్ధాలు చెప్పొచ్చా? రెండుసార్లు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆరే. తొమ్మిదేళ్లలో ఈ ప్రధాని దేశానికి చేసిందేముంది. ఆయన ప్రధాని అయినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను తిట్టారు. ఈరోజు సిలిండర్ ధర రూ.1,200కు చేరుకుంది. మోదీ పాలనలోనే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మోదీని చేతగానోడు అనాలా? సన్నాసి అనాలా? దద్దమ్మ అనాలా?’అని కేటీఆర్ ప్రశ్నించారు.
కరెంట్ తీగలు పట్టుకుని చెక్ చేసుకోండి
‘రాష్ట్రంలో 24 గంటల కరెంటు చూపిస్తే రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్నారు. వారికి అనుమానం ఉంటే మేమే బస్సు పెడతాం. చెక్ చేసుకునేందుకు రావాలి. వెంకట్‌రెడ్డి, రేవంత్, కాంగ్రెస్ నేతలందరూ రావాలి. ఏ సమయంలో, ఏ ఊరికి వెళతారో వెళ్లి అందరూ కరెంటు తీగలు పట్టుకొని నిలబడితే తెలుస్తుంది. దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా దేశాన్ని పాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే ఉందని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని తెస్తే.. కేటీఆర్ ప్రపంచానికి తెలంగాణ అంటే ఏమిటో తెలియజేశారన్నారు.
ఒక్క చెయ్యోడని అవమానించారు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్లగొండలో జరిగిన ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు నన్ను అవమానించారు. ఒక్క చెయ్యోడు ఏం చేస్తాడని అన్నారు. నాకు ఒక్క చెయ్యి మాత్రమే ఉన్నా.. మీ చేతులు నాకు తోడయ్యాయి.. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకుడిని చిత్తుగా ఓడించారు..’అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆయన్ను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment