సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం పని కట్టుకుని హిందుత్వంపై, దేవాలయాలపై కావాలని దాడి చేస్తున్నట్లు కొన్ని రాజకీయ పార్టీలు అబద్ధపు ప్రచారం మొదలెట్టాయని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అమ్మవారి రథానికి చెందిన విగ్రహాలు కనబడకపోతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి వెంటనే చర్యలు తీసుకున్నారని, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి.. అక్కడ మాట్లాడిన మాటలు చూస్తే.. శాసనమండలికి ఎలాంటి చిల్లర గాళ్లను చంద్రబాబు నామినేట్ చేశాడో అర్ధం అవుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రి ఇంట్లో మూడు సింహాలు ఉంటాయనే దిగజారుడు స్థాయి మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు హాయంలో విజయవాడలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమాలు ప్రజలు మర్చి పోతారా అని ప్రశ్నించారు. ‘ బుద్దా వెంకన్న గుర్తు తెచ్చుకో! ఎట్లాపడితే అట్లా మాట్లాడి బురద జల్లే కార్యక్రమాలు చేయడం మానుకో’ అని హెచ్చరించారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పగలగొట్టి మున్సిపల్ ట్రాక్టర్‌లో తరలించిన మీకు, మీ పార్టీకి హిందూ ధర్మం గురించి మాట్లాడే నైతిక ధర్మం ఉందా?. బుద్ధా వెంకన్న నీ ఇంటికి చుట్టు పక్కలే కదా అన్ని దేవాలయాలు కూల్చేసింది ?.. ఆ రోజు గుర్తు రాలేదా ? . చంద్రబాబు కులం, మతం తేడా లేకుండా అవసరాలకు వాడుకునే మర మనిషి. బాబు హయాంలో అమ్మవారి ఆలయంలో క్షుద్ర, తాంత్రిక పూజలు జరిగాయి. అవి ఎవరు చేయించారు. దానికి సమాధానం చెప్పరే?. తిరుపతి దేవస్థానం పవిత్ర దేవస్థానం. దానిపై కూడా రాజకీయం చేస్తున్నారు. వేయి కాళ్ల మండపం కూల్చింది ఎవరు మీరు కాదా?. తిరుమలలో పుట్టినరోజు వేడుకలు చేసుకుంది మీరే కాదా?.
తిరుమల పవిత్రతను కాపాడింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్. పుష్కరాలలో మీరు స్నానం చేస్తే గోదావరి తల్లి అగ్రహించి.. 30 మందిని బలి తీసుకున్నది. ఈ రాష్ట్రంలో మతం, కులం, పార్టీ తేడా లేకుండా ప్రజలు 50 శాతం ఓట్లతో వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటే ఓర్వలేక... చూసి సహించలేక పోతున్నారు. కులాలు, మతాలు పేరుతో మీరు చేస్తున్న దమన కాండను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. తెలుగు దేశం నాయకులు మీ నాయకుడి గురించి ఆలోచించండి ? అసమర్థ నాయకత్వం చంద్రబాబుద’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment