
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. గురువారం పీటీఐ వార్త సంస్థ ఇంటర్వ్యూలో కవిత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇ చ్చిందని, ఆ పార్టీ మాటలు నమ్మశక్యం కావన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ప్రధాని మోదీకి తెలంగాణ అంటే ఎందుకు కక్షనో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో మోదీ అంత పెద్ద మాట అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై స్పందిస్తూ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఏ రాష్ట్రంలో చూసినా ఇదే వైఖరిని అవలంబిస్తున్నారని కవిత విమర్శించారు.
ఇలాంటి చర్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నది గుర్తుంచుకోవాలన్నారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. కేంద్రం తలుచుకుంటే అమలు చేయవచ్చని కానీ బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోదని మహిళలకు అర్థమైందని, మహిళా బిల్లు సాధనకు ఉద్యమించిన తరహాలో త్వరగా అమలు చేయాలని కూడా ఉద్యమిస్తామని ప్రకటించారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో కోటా కోసం కూడా మా పోరాటం సాగుతుందని కవిత తెలిపారు.
‘ప్రజల మేలు కోరి సమర్థించి తీరుతాం’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సమాజంలో అత్యధిక ప్రజల ధోరణి ఈ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి. ఈ దొరహంకార దుర్మార్గ పరిపాలన అంతం కావాలి అని కోరుకుంటున్నట్టు అభిప్రాయం వినబడుతున్నది’అని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తాము జరుపుతున్న భేటీలపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ గురువారంరాత్రి ఈ ట్వీట్ చేశారు. ఈ నిజమైన ప్రజాభావాలను దశాబ్దాల తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల మేలు కోరుతూ సమర్థించి తీరుతానని పేర్కొన్నారు.
‘గత కొన్నిరోజులుగా సమావేశమవుతున్న బీజేపీ నేతలందరం.. ప్రజాకంటక బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ తొలగించగలదనే విశ్వాసంతోనే బీజేపీలో చేరినం. అందుకు మేం సాధ్యమైనంతవరకు అన్నివిధాలుగా ప్రయత్నించడం సహజం. పార్టీకి కూడా అదే తెలియజేసినం. నిజానిజాలు తెలుసుకోగలిగిన విజ్ఞత తెలంగాణ బిడ్డలకు ఎప్పుడూ ఉంటుందని నా విశ్వాసం. ఇదే సత్యం’అని విజయశాంతి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment