
సాక్షి, విశాఖపట్నం: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. అలాగే, అనితా ఒక అసమర్థ హోం మినిస్టర్ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా? అని ప్రశ్నించారు.
కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘హోంమంత్రిగా అనిత విఫలమయ్యారు. తాను ఎప్పుడూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు, దాడులే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా?. ఫ్యాక్టరీస్ భద్రతపై ఏనాడైనా సమీక్ష చేపట్టారా?. అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందింది.
మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపారు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక హెలికాప్టర్ పంపలేరా?. పపేర్లు కున్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా?. అనిత భాష చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. అనిత ఓ అసమర్థ హోంమంత్రి. కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్‌పై విమర్శలు పక్కన పెట్టి ప్రమాదాల నివారణపై దృష్టి పెడితే బాగుంటుంది. ఆమెకు సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద లేదు’ అంటూ విమర్శించారు.
