
కోల్‌కతా: మంత్రి సుభేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌ను వీడినట్లయితే మమత సర్కారు కుప్పకూలూతుందంటూ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో చేరినట్లయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జగద్దల్ ఘాట్ వద్ద శనివారం ఆయన ఛట్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘తృణముల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎంపీలు కాషాయం కండువా కప్పుకోవడం ఖాయం. సుభేంధుని టీఎంసీ పార్టీ చాలా అవమానించింది. తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధించింది. కానీ ప్రజా నాయకులను అలాంటి చర్యలు ఏమీచేయలేవు. (చదవండి: సవాళ్లను స్వీకరించాలి, పోరాడాలి, ఓడించాలి)
సుభేందు వంటి ఎంతో మంది నేతల ప్రోద్బలంతో మమతా బెనర్జీ నాయకురాలిగా ఎదిగారు. కానీ ఇప్పుడు గతాన్ని, ఎంతో మంది నేతల త్యాగాన్ని మర్చిపోయి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం కుర్చీపై కూర్చొబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఏ నాయకులు ఒప్పుకోరు’’అంటూ విమర్శలు గుప్పించారు. అదే విధంగా టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తారని అర్జున్ సింగ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన కేవలం టీఎంసీ నాయకుడిలా మీడియా ముందు నటిస్తున్నారని, ఏ క్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుభేందుతో సౌగతా రాయ్ చర్చలు జరుపుతున్నారని, ఒక్కసారి కెమెరా కళ్లు వారిని దాటిపోయినట్లయితే వారు కాషాయ కండువా కప్పుకోవడం తథ్యమని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను సౌగతా రాయ్ వట్టి పుకార్లేనంటూ కొట్టివేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment