బెజవాడలో తెలుగుదేశం బజారున పడింది. పార్టీ ముఖ్యనేతలు రోడ్డున పడి టికెట్ల కోసం విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబు పెంచి పోషించిన ముఠాలే ఈ వైపరీత్యాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం పార్టీలో చంద్రబాబు ఒక వర్గం, లోకేష్ మరో వర్గం నడుపుతున్నారు. టికెట్ల విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయం అని చెప్పినా.. నాయకులంతా లోకేష్ చుట్టే తిరుగుతున్నారు. ఈ పరిస్థితే.. పార్టీలో చిక్కులు తెచ్చి పెడుతోంది.
విజయవాడ: మరోసారి సైకిల్ పార్టీ పంచాయతీ రోడ్డెక్కింది. సొంతపార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్న బుద్ధా వెంకన్నను టార్గెట్ చేస్తూ ఎంపీ కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుద్ధా వెంకన్న విజయవాడ ఎంపీ టికెట్ ఈసారి తనదేనని ధీమాలో ఉన్న సమయంలో ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం సొంతపార్టీలో అగ్గికి ఆజ్యం పోసినట్లయ్యింది.
ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ను ఆహ్వానిస్తున్నా
‘విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ను నేను ఆహ్వానిస్తున్నా. కాల్‌మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించేవాళ్లు బీసీలు కాదు. నీతి, నిజాయితీ, మచ్చలేని వ్యక్తులే అసలైన బీసీలు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్, గూండాగిరి చేసేవాళ్లు బీసీల కిందరారు. భూకబ్జాలు చేసేవాళ్లు, జనాలను హింసించిన వాళ్లు బీసీలు కాదు. పార్టీకోసం కష్టపడిన నిఖార్సైన బీసీలు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి టిక్కెట్లిస్తే సంతోషిస్తా. నిరుపేదలైనా కాళ్లకు దండం పెడతాం’ అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు.
విజయవాడ టీడీపీ ఎంపీ సీటుపై ముసలం
విజయవాడ ఎంపీ టికెట్‌ను బీసీలకు ఇవ్వాలనే డిమాండ్‌ను బీసీ సంఘాలు తెరపైకి తీసుకొచ్చాయి. ఇక్కడ ఏ పార్టీ పోటీ నుంచి ఆభ్యర్థి అయినా బీసీ నేతే ఉండాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్‌ను బుద్ధా వెంకన్న ఆశిస్తున్న సందర్భంలో ఇలా కేశినేని నాని.. వ్యాఖ్యానించడం ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాల తీవ్రతకు అద్దం పడుతోంది.
తన సీటుకే ఎసరు పెడుతుండటంతో కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలను చేయడం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. బీసీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఆహ్వానిస్తున్నా అంటూనే సదరు అభ్యర్థి బాధ్యత తానే తీసుకుంటానని కూడా కేశినేని నాని వ్యాఖ్యానించడంతో బుద్ధా వెంకన్న చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టాలనేది కేశినేని ప్లాన్‌లో భాగమేనా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment