
మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ రూరల్/లోకేశ్వరం (ముధోల్): సమస్యలు పరిష్కరించాల్సిందిగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నెల రోజుల నుంచి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు తెలుకోవడం లేదని.. మరో పక్క విద్యార్థులను కలవకుండా తమను అడ్డుకుంటోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఆదివారం ఆయన ఆదిలాబాద్ నుంచి బాసరకు బయల్దేరగా, లోకేశ్వరం మండలం అర్లి వంతెన వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎంపీని స్టేషన్‌కు తరలించకుండా భైంసా మార్గంలో ఆదిలాబాద్‌కు తరలించారు.
నా నియోజకవర్గంలో నేను తిరగొద్దా..
పోలీసులు తనను ట్రిపుల్ ఐటీకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని ఎంపీ సోయం బాపూరావు తప్పుబ ట్టారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో తిరగొద్దా’అని ప్రశ్నించారు.
ట్రిపుల్ ఐటీలోని మెస్ కాంట్రాక్టర్లు సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యక్తులు కావడంతోనే నాణ్యతలేని సరుకులతో భోజనం వడ్డిస్తున్నా, చివరకు ఫుడ్ పాయిజన్ జరిగినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారని ఎంపీ ఆరోపించారు. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment