బాబు రాజకీయాలకు పనికిరాడని ఇప్పుడు తెలిసిందా.. భువనేశ్వరీ? | Naramalli Padmaja Reacts Nara Bhuvaneswari Comments Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు రాజకీయాలకు పనికిరాడని ఇప్పుడు తెలిసిందా.. భువనేశ్వరీ?

Published Wed, Feb 21 2024 7:52 PM | Last Updated on Wed, Feb 21 2024 8:23 PM

Naramalli Padmaja Reacts Nara Bhuvaneswari Comments Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే మూడు ‘సిద్ధం’ సభలు జరిపామని, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలను.. నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని ప్రజలకు వివరించామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (మహిళాశిశు సంక్షేమం) నారమల్లి పద్మజ అన్నారు. ‘2019 మ్యానిఫెస్టోలో మేము చెప్పిన ప్రతీ వాగ్దానాన్నీ.. చేసి చూపించాం. మా పాలనే సాక్ష్యంగా 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్ళి.. కాలర్‌ ఎగరేసి మరీ ఓట్లు అడుగుతామని ఆరోజు చెప్పాం.. ఈరోజూ అదే చెబుతున్నాం’ అని  అన్నారు.

మూటాముల్లె సర్దేసిన తెలుగుదేశం పార్టీ
రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం.. మా పాలనే దానికి సాక్ష్యం.. మమ్మల్ని మరోమారు ఆశీర్వదించడానికి సిద్ధమా..? అని మా నాయకుడు జగన్‌ గారు ప్రజలను కోరినప్పుడు వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ను చూసి తెలుగుదేశం పార్టీకి వెన్నులో చలి పుట్టిందేమో.. ఇప్పటికే మూటాముల్లె సర్దేసింది. దాని పరిణామాలు కూడా ఒక్కొక్కటిగా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. 

చంద్రబాబు రెస్టు తీసుకోవాలని భువనమ్మే చెబుతోంది
ఈరోజు నారా భువనేశ్వరి కూడా ఇదే విషయాన్ని మరోమారు ధృవీకరించింది. మా ఆయన చంద్రబాబు రెస్ట్‌ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తన భర్త రాజకీయాలకు ఇక పనికిరాడని.. అలసిపోయాడని.. మీడియా ముందుకొచ్చి ఆమె మాట్లాడిన సందర్భాన్ని చూశాం. ఇది నిజమే.. హైదరాబాద్‌లోని ఏఏజీ ఆస్పత్రి కూడా చంద్రబాబు గురించి అదే చెప్పింది. ‘నీకు సకల రోగాలు ఉన్నాయి. నువ్వు గానీ నడవాలంటే.. వెనుక ఒక అంబులెన్స్‌ ఉండాలి. ఇక, బిజీ రాజకీయాలకు నువ్వు పనికిరావు.. రెస్టు తీసుకోవాలి..’ అని ఆస్పత్రి రిపోర్టు ద్వారానే చెప్పారు. అయినా.. ఆయన విన్లేదు.  

అందుకే.. చంద్రబాబు బైబై.. అని ఓపెన్‌గా చెప్పింది
తన భార్యను ఎవరూ ఏమీ అనకుండానే వెక్కి వెక్కి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు. మా నాన్నను ముసలోడంటున్నారని లోకేశ్‌ కూడా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. తండ్రీ కొడుకులు ఎంతగా ఏడ్చినా.. మొత్తుకున్నా.. ప్రజల నుంచి వారు ఆశించినంత స్పందన రాకపోవడంతో ఇక, చివరికి కుర్చీలు మడత పెట్టుకునే పనిలో పడ్డారు. పాపం, తన భర్త, కొడుకు పడుతున్న పాట్లు గమనించిన భువనేశ్వరి ఈరోజు ఓపెన్‌గానే చంద్రబాబు బైబై.. అని చెప్పారు. ఆయన కూడా రాజకీయాలకు బైబై చెప్పాల్సిన అవసరముందని.. రెస్టు తీసుకోవాల్సిన వయసొచ్చిందని.. నీకు ప్రజల నుంచి ఆదరణ కరువైందని తన భర్తకూ ఆమె గుర్తుచేశారు.

వెన్నుపోటుకు బదులు చెప్పిందా..? లోకేశ్‌ మాట్లాడించాడా..?
సుదీర్ఘకాలం కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఇక పనికిరాడని స్వయంగా ఆయన భార్యే చెబుతున్న క్రమంలో.. అందరిలోనూ ఓ ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఆయన ఎమ్మెల్యేగానే పనికిరాడా..? లేదంటే, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడా..? అని భువనేశ్వరి మాటల అంతరార్థాన్ని విశ్లేషిస్తున్నారు. ఆమె ఇవన్నీ నిజంగానే చెబుతుందా..? లేదంటే, తండ్రి ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటుకు బదులుగా చెబుతుందా..? ఒకవేళ.. లోకేశ్‌బాబే తన తల్లి చేత ఇలా మాట్లాడిస్తున్నాడా..? మా నాన్న పని అయిపోయింది. నేటి రాజకీయాలకు ఆయనెటూ పనికిరాడని.. ఎలాగైనా మూలన కూర్చోబెట్టాలని తల్లికి చెప్పాడా..? అనేది తేలాల్సిన సందర్భమిది.

అబద్ధాలాడటంలో తండ్రీకొడుకుల్ని మించిపోయింది
భువనేశ్వరి అక్క పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంది. అలాగే, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా భువనేశ్వరి చేపడితే బాగుంటుందేమో.. ఎందుకంటే, ఆమె మాటల్లోని అబద్ధాల్ని చూస్తుంటే.. ఖచ్చితంగా రాజకీయాల్లోకి పనికొస్తుందని చెప్పొచ్చు. కన్నార్పకుండా అబద్ధాలు అల్లి ప్రచారం చేయడంలో తన భర్త, తన కొడుకును మించిపోయింది.

మహిళల పక్షాన అప్పుడెందుకు నోరుమెదపలేదు..?
ఆడపిల్ల ఆర్థరాత్రి నడవాలంటే మంచి ప్రభుత్వం రావాలంటున్న నువ్వు.. నీ బుద్ధి, నీ విచక్షణను నీ భర్త పాలనలో ఎక్కడ పెట్టుకున్నావని మేం ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు పాలన లేకుంటే మహిళలు వీధుల్లో నడవలేని పరిస్థితుల్లేవని మాట్లాడుతున్న నీకు మేము కొన్ని ప్రశ్నలడుగుతున్నాం. జవాబివ్వగలవా..? నీ భర్త చంద్రబాబు హయాంలో మహిళలపై అనేక దురాగతాలు జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు..? కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లో నీ తెలుగుదేశం పార్టీ నాయకులే దాదాపు 200 మంది మహిళల్ని లైంగికంగా హింసించి.. బెదిరించి బ్లూ ఫిల్మ్‌లు తీసినప్పుడు నువ్వెందుకు స్పందించలేకపోయావు..? తహశీల్దార్‌ వనజాక్షిని నీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏవిధంగా దాడిచేసి అవమానించాడో మీడియా సాక్షిగా నువ్వు చూసినా.. బయటకొచ్చి ఇది తప్పు అని మహిళల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోయావు..? రిషితేశ్వరి అనే విద్యార్థినిని అత్యంత పాశవికంగా హింసిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుని మరణిస్తే చదువుకునే బాలికల తరఫున నువ్వెందుకు నీ భర్తను నిలదీయలేదు..? వీటన్నింటికీ.. నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. 

బీసీ, దళిత మహిళల్ని అవమానిస్తే.. నువ్వు స్పందించలేదేం..?
కుప్పంలో ఓ బీసీ మహిళ వైఎస్‌ఆర్‌సీపీ మీటింగ్‌కు హాజరైందని .. ఆమెను వివస్త్రను చేసి వీడియోలు చిత్రించి హింసించిన వైనం నీకు తెలియదా ..? ఆ ఘటనను కుప్పం ప్రజలు మరిచిపోగలరా..? అదేవిధంగా పెందుర్తిలో ఓ దళిత మహిళ.. తన అసైన్డ్‌ స్థలాన్ని లాక్కోవద్దని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడితే నీ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎలా కిరాతకంగా ప్రవర్తించాడో నీకు మీడియాలో నువ్వు చూడలేదా.? నీ సొంత తమ్ముడు మహిళల గురించి ఏం మాట్లాడాడో.. వినలేదా..? వాటిని చూసి ఒక మహిళగా స్పందించలేదెందుకు..? 

మీ హయాంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పు
సభా వేదికపైనే ఒక మహిళను చూస్తే ముద్దెట్టుకోవాలి.. కడుపైనా చేయాలని నీ సోదరుడు మాట్లాడిన సంగతి నీకు తెలిసీ ఎందుకు మౌనంగా ఉన్నావు..? సాటి మహిళగా స్పందించి.. నీ తమ్ముడుకి గడ్డిపెట్టాలని అనిపించలేదా..? నీ తమ్ముడు బాలకృష్ణలాంటి అచ్చోసిన ఆంబోతుల్ని ఏం చేయాలి..? నిలువునా కాల్చేయాల్నా..? వీటన్నింటికీ నువ్వు స్పందించి.. నీ పార్టీ హయాంలో జరిగిన తప్పులను ఒప్పుకుని.. మీ తెలుగుదేశం పార్టీ తరఫున.. నీ తమ్ముడి తరఫున బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భువనేశ్వరిని మేము డిమాండ్‌ చేస్తున్నాం.   

పక్క రాష్ట్రాల్లో జరిగిన నేరాలనూ ఆంధ్రకు అంటగడతారా..?
చంద్రబాబుకు మూటలు మోసే నాయకుడున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కిందటేడాది ఆగస్టు 22న జరిగిన అత్యాచారం గురించి ఈరోజు ఇక్కడ భువనేశ్వరి మాట్లాడింది. అక్కడ ఓ బాలికపై గంజాయి తాగిన ఉన్మాదులు అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ నేరాన్ని తెచ్చి ఇప్పుడు ఆంధ్రలో ఉన్న ప్రభుత్వంపై అంటకట్టడానికి ప్రయత్నించడం నీకు సిగ్గనిపించడం లేదా..? అని భువనేశ్వరిని అడుగుతున్నాను. అబద్ధాల్లో నీ భర్త, నీ కొడుకును మించి పోయావు గనుక.. ఇప్పుడు నిలువునా మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీకి నువ్వు అధ్యక్షరాలివయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక పగ్గాలు చేపట్టమని చెప్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement