తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ వల్ల తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. ఆయన గతంలో ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా పోటీచేసినప్పుడు బీఆర్‌ఎస్(అప్పటి టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలు తొమ్మిది మందిని ఆకర్షించగలిగారు. వారిని ఏ రకంగా ప్రలోభ పరిచారో కాని, వారంతా విప్‌ను ధిక్కరించి జ్ఞానేశ్వర్‌కు ఓటు వేసి గెలిపించారు. దాంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. దానిని విచారించిన సురేష్ రెడ్డి సుమారు మూడేళ్ల తర్వాత వారందరిపై అనర్హత వేటు వేశారు.
అయితే వేటు వేయడానికి ఒక రోజు ముందు వీరంతా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనబోయి దొరికిపోయిన సంగతి తెలిసిందే. జ్ఞానేశ్వర్ పట్టుబడలేదు కాని , ఆయనకు ఓటు వేసిన వారు పదవులు వదలుకోవాల్సి వచ్చింది. ఇటీవలే జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ అధ్యక్షుడుగా ఎంపిక చేసుకున్నారు. అప్పట్లో అనర్హత వేటుకు గురైనవారిలో ఎస్.బాపూరావు, నారాయణరావు పటేల్, ఎస్.సంతోష్‌రెడ్డి జి.ముకుందరెడ్డి, కాశీపేట లింగయ్య, జగ్గారెడ్డి, డి.శ్రీనివాసరావు, ఎమ్. సత్యనారాయణరెడ్డి, బి.శారారాణి ఉన్నారు. కాగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఏర్పడిన పరిణామాలలో ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన కొండా సురేఖ కూడా అనర్హత వేటుకు గురయ్యారు.
మంత్రులకు అత్యంత భద్రత ఉంటుంది. అందులోను హోం శాఖను నిర్వహిస్తున్నవారికి మరింత సెక్యూరిటీ ఇస్తారు. కాని దురదృష్టవశాత్తు ఉమ్మడి ఏపీ లో హోం మంత్రిగా బాద్యతలు నిర్వహిస్తూ 2000 సంవత్సరంలో నక్సల్స్ మందుపాతరకు ఎ. మాధవరెడ్డి బలైపోయారు. అప్పట్లో వరంగల్ రోడ్డులో వెళుతుండగా, ఘటకేసర్ వద్ద వంతెన నిర్మాణం జరుగుతున్న చోట నక్సల్స్ మందుపాతర అమర్చారు. ఆయన వాహనం అక్కడికి రాగానే దానిని పేల్చడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అప్పట్లో ఆయన చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నాలుగుసార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మాధవరెడ్డి మరణం తర్వాత ఆయన భార్య ఉమా మాధవరెడ్డి మూడుసార్లు అక్కడ నుంచి గెలుపొంది మంత్రి పదవి కూడా నిర్వహించారు.
ప్రముఖ తెలంగాణ నేత సి.మాధవరెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మాత్రమే ముప్పై స్థానాలను గెలుచుకుంది. ఇందిరాగాంధీ పై ఉన్న సానుభూతితో ఆమె కుమారుడైన రాజీవ్గాంధీకి దేశం అంతటా పట్టం కట్టింది.
కాని ఏపీలో అప్పటికే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్ యత్నించిందన్న అసంతృప్తితో ఉన్న ప్రజలు తెలుగుదేశంకు అత్యధిక సీట్లు కట్టబెట్టారు. దేశంలో మరే రాజకీయ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. దాంతో సి.మాధవరెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతకు ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంటుంది. సి.మాధవరెడ్డి ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకుముందు 1952లో ఆయన సోషలిస్టు పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరి బోధ్ నియోజకవర్గం జనరల్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment