న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తాను ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వ్యక్తినని అన్నారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై విపక్ష ఎంపీలు కేంద్ర హోం మంత్రి స్పందించాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాల ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దానిని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను అనుకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ధన్‌ఖడ్.. తనను, తన కులాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
అయితే తాజాగా ఆయన ఈ వ్యవహారంపై ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసు(ఐఎస్‌ఎస్) ప్రొబేషనర్లు ఏర్పాటు చేసిన ఓ కర్యక్రమంలో మాట్లాడారు. ‘నేను ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించిన వ్యక్తిని. అన్ని వైపుల నుంచి వచ్చే అవమానాలు, బాధలను సహించడం నాకు తెలుసు. మనం భారత మాత సేవలో ఉన్నాం’ అని అన్నారు. విమర్శలను తట్టుకోవడం నేర్చుకోవాలని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నప్పటికీ దేశ ప్రజలు తనకు దూరంగా లేరని తెలిపారు.
రాజ్యసభ చైర్మెన్‌గా, ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ హోదాలో ఉన్నప్పటికీ తనను ప్రజలు ఎప్పుడూ విడిచి పెట్టలేదని తెలిపారు. అది తన ఆలోచనా విధానాన్ని మార్చాలా?.. అది తన మార్గాన్ని తప్పుదారి పట్టించాలా? అని అన్నారు. ధర్మ మార్గంలో మనం ఎల్లప్పుడూ ముందుకు సాగాలని తెలిపారు. మన ఎదుగుదలను చూసి ఎవరైతే తట్టుకోలేరో.. అటువంటి వారే ఎప్పుడూ విమర్శలు చేస్తారని మండిపడ్డారు.
చదవండి: ‘మార్పు’పై అసంతృప్తి!
Comments
Please login to add a commentAdd a comment