రాజమండ్రి: సెంట్రల్ జైల్ వేదికగా టీడీపీ-జనసేనల పాలిట్రిక్స్ బయటపడ్డాయి. ఈ రెండు పార్టీల ముసుగు తొలిగిపోయింది. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నాం. ఈ విషయం జనసేన కార్యవర్గం అర్థం చేసుకోవాలి.తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని నేను ఇవ్వాళ నిర్ణయం తీసుకున్నాను. విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్‌సిపిని ఆపలేం. ఇక నుంచి టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని ప్రకటించారు.
తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఇక మాతో కలుస్తుందా లేదా అన్నది బీజేపీ తేల్చుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సిపిని ఒంటరిగా ఎదుర్కోలేం కాబట్టి.. కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2019లో విడివిడిగా పోటీ చేసినందుకు నష్టపోయామని, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని జనసేన కార్యవర్గం గుర్తించాలని, తాము ఉమ్మడిగా పోటీ చేసినందువల్ల నష్టం జరిగినా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచే టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమవుతుందన్నారు పవన్.
"తెలుగుదేశం నేతలతో కలుస్తున్నానంటే అది పాలకపక్షం వల్లే. ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్‌ల మధ్య ఉన్నానంటే అది పాలకపక్షం వల్లే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును చట్టవ్యతిరేకంగా జైల్లో పెట్టారు. చంద్రబాబుకు నా మద్ధతు ప్రకటిస్తున్నా. గతంలో విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలున్నాయి. అందుకే 2019లో వేర్వేరుగా పోటీ చేశాం. 2014లో విభజన జరిగినపుడు రాష్ట్రానికి నష్టం కలిగింది. 2014లో నేను నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపాను." అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
"భారత్ మీద తరచుగా ఉగ్రదాడులు జరిగినపుడు బలమైన నాయకత్వం కావాలనుకున్నాను. నాడు నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే నేను వెళ్లాను తప్ప.. నా అంతట నేను కాదు. చంద్రబాబుతో నాడు ప్రత్యేక హోదా కోసం విభేదించాను తప్ప.. ఆయనంటే నాకు నమ్మకం. చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకు విశ్వాసం ఉంది. బ్యాంకులో తప్పు జరిగితే .. బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఉంది. చంద్రబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించాలి కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తుంది?" అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment