
వలంటీర్ల సేవలు కొనసాగించాలని గోమంగి సచివాలయం వద్ద పింఛన్‌దారుల నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబుపై పింఛన్‌దారుల ఆగ్రహం
రాష్ట్రంలో పలుచోట్ల లబ్ధిదారుల ఆందోళన
బాబు పాలన, జన్మభూమి కమిటీలను తలుచుకుంటేనే భయమేస్తోందంటూ ఆవేదన
రాజమహేంద్రవరం సిటీ/పెదబయలు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ‘మాపై నీకెందుకింత కక్ష? వృద్ధుల విషయంలో కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావ్. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకుంటావా?’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ పింఛన్ కానుక లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జాంపేట గణేష్ చౌక్ వద్ద వందలాది మంది పింఛన్‌దారులు సోమవారం ఆందోళన చేశారు.
ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్లు తమ ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్ డబ్బులు చేతిలో పెట్టేవారని చెప్పారు. కానీ ఈ దుర్మార్గపు చంద్రబాబు చేసిన పని వల్ల ఈరోజు ఇంటి వద్ద పింఛన్ అందుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాలనలో అసలు పింఛన్ మంజూరవ్వడానికే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని.. పింఛన్ కోసం ఎండలో క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు పడేవాళ్లమంటూ గుర్తు చేసుకున్నారు. ఆకలి వేసినా, వడదెబ్బ కొట్టి పడిపోయినా, అనారోగ్యం వచ్చినా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదన్నారు. అధికారం నుంచి దించేసినా చంద్రబాబుకు సిగ్గురాలేదని మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని.. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు పాలన, ఆ జన్మభూమి కమిటీలను తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. టీడీపీ పాలనలో పింఛన్ కోసం కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలన వచ్చాక ప్రతి నెలా క్రమం తప్పకుండా వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని.. ఇంత చక్కని పాలన ఇంకెవ్వరూ అందించలేరన్నారు. తమకు మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలంటూ నినాదాలు చేశారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని ఎంపీ భరత్ చెప్పారు.
బాబు నిర్వాకంతో 10 కిలోమీటర్లు నడవాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి, గుల్లేలు పంచాయతీల పరిధిలోని పింఛన్‌దారులు సోమవారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థ వల్ల ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే వలంటీర్లు తమ ఇళ్లకు వచ్చి పింఛన్ ఇచ్చేవారని చెప్పారు. కానీ చంద్రబాబు చేసిన పని వల్ల ఏజెన్సీలో ఉండే తాము ఎంతో బాధపడాల్సి వస్తోందన్నారు.
గుల్లేలు పంచాయతీ కించూరు, బూరుగువీధి, పెదవంచరంగి, జంగంపట్టు గ్రామాలకు సుమారు 10 కిలోమీటర్ల దూరమని, గోమంగి పంచాయతీ కరుగొండ, బొండ్డాపుట్టు, కుంతురుపుట్టు, వన్నాడ, వంకరాయి గ్రామాలకు కూడా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నిర్వాకం వల్ల తాము 10కిలోవీుటర్లు నడిచి వచ్చి సచివాలయంలో పింఛన్ తీసుకోవడం కష్టంతో కూడుకున్నదని వాపోయారు. చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులను నమ్మవద్దని ఎన్నికల కమిషన్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment