ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా
మహారాష్ట్ర, గోవాలో ఎన్నికల ప్రచారం
కొల్హాపూర్/గోవా: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు కుర్చీ ఎక్కుతారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశమే లేనప్పటికీ ఎవరెప్పుడు ప్రధాని కావాలన్న దానిపై ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను దేశం భరించబోదని అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌తోపాటు గోవాలో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. కర్ణాటకలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చారని తప్పుపట్టారు. దీంతో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక మోడల్ దేశమంతటా అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. సామాజిక న్యాయాన్ని హత్య చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా? అని నిలదీశారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. వారసత్వ పన్ను విధించి జనం ఆస్తులు లాక్కోవాలని చూస్తున్న పార్టీలను అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించింనందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికలు రెండు శిబిరాల మధ్య జరుగుతున్నాయని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఎన్డీయే ఒకవైపు, సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment