
టాలీవుడ్ హీరో నితిన్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?.. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా?. సినిమా కెరీర్‌ను ఫణంగా పెట్టి పొలిటికల్ కెరీర్‌లోకి దూకేంత సాహసం చేస్తారా?. ఎందుకు ఈ మధ్యన హీరో నితిన్ పేరు చెప్పగానే అనేక రాజకీయ పుకార్లు షికారు చేస్తున్నాయి?..
నిజామాబాద్ జిల్లాకు చెందిన యంగ్ హీరో నితిన్ పేరు ఈ మధ్యకాలంలో పొలిటికల్ సర్కిల్స్‌లో పదే పదే వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆయన నిజమాబాద్ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే పుకారు ఒకటి షికారు చేస్తోంది. నితిన్ బంధువులు కొందరు రాజకీయాల్లో ఉండటంతో వారి ఈ గుసగుసలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ విషయాన్ని జిల్లాకు చెందిన కొందరు రాజకీయ విశ్లేషకులు కొట్టేస్తున్నారు. ఆయన తన బంధువులకు టికెట్ ఇప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప స్వయంగా రాజకీయాల్లో రావడానికి కాదు అని వారు అభిప్రాయపడుతున్నారు.
పొలిటికల్ ఎంట్రీపై పుకార్లు షికారు..
నితిన్ రాజకీయ ప్రవేశం గురించి గతంలో కూడా వాడిగా వేడిగా పుకార్లు షికారు చేశాయి. గతంలో ఆయనను కొంతమంది బీజేపీ పెద్దలు కలిసి తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలకడమే దీనికి కారణం. అయితే, ఆయన వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తన బంధువులు కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో తన మద్దతు కాంగ్రెస్‌కే వుంటుందని చెప్పినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్‌తో సత్సంబంధాలు..
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన నితిన్ కుటుంబం.. చాలా రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉంది. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి పేరున్న నిర్మాత. నితిన్ రక్త సంబంధీకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మేనమామ నగేష్ రెడ్డి గతంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీకి పది సంవత్సరాలు చైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ టికెట్‌ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ టికెట్‌ను జిల్లాకు చెందిన అరికెల నర్సారెడ్డి, భూపతిరెడ్డి లాంటి నాయకులు ఆశిస్తున్నట్టు సమాచారం.
రేవంత్‌తో భేటీ..
నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ మీదే హీరో నితిన్ కూడా కన్నేశారా? అనే చర్చ నడుస్తోంది. అయితే, నితిన్ స్వయంగా రాజకీయాల్లోకి రాకపోవచ్చని.. తన మేనమామ నగేష్ రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల రేవంత్ రెడ్డితో నగేష్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ సమయంలో టికెట్ ప్రస్తావన వచ్చిందని సమాచారం. అయితే, సర్వేల ఆధారంగానే టికెట్ కేటాయింపు ఉంటుందని రేవంత్.. నగేశ్‌కు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నితిన్ ద్వారా టికెట్ కోసం నగేశ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపోస్తోంది. మరి నితిన్ స్వయంగా రాజకీయ రంగంలోకి దిగుతారా లేదా మేనమామకు టికెట్ ఇప్పించుకుంటారా అనేది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: బీజేపీలో బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి సమక్షంలో నేతల మధ్య రగడ
Comments
Please login to add a commentAdd a comment