సాక్షి, హైదరాబాద్, గన్‌పౌండ్రీ: రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కొండ చిలువలకు, చలిచీమలకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సోమవారం కాన్షీరాం 17వ వర్ధంతి సందర్భంగా ఎన్నికల నగారా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాబలం బీఎస్పీకి ఉందనీ, మరో రెండు నెలలు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
బహుజనులు పాలకులు కావాలని కలలుగన్న కాన్షీరాం పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతుంటే ఈ వర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలం, ఒత్తిడితోనే వట్టే జానయ్య యాదవ్‌పై నిరాధారంగా పోలీసులు కేసులు పెట్టారని విమర్శించారు.
తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేయాలి
బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేసి, ఏనుగుపై ప్రగతి భవన్‌కు వెళ్ళాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. మెజారిటీ ప్రజలకు అధికారం దక్కాలనేదే బీఎస్పీ ధ్యేయమని పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డనేటర్ మంద ప్రభాకర్ అన్నారు. సభలో పార్టీ ఉపాధ్యక్షులు దాగిళ్ళ దయానంద్, చాట్ల చిరంజీవి, రుద్రవరం సునీల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment