న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలకు దిగారు. తనపై త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసే అవకాశం ఉందని అన్నారాయన. అందుకు తన చక్రవ్యూహ్ ప్రసంగమే కారణమని చెబుతూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. : రాహుల్ గాంధీ
నాపై ఈడీ దాడులు జరగొచ్చు. ఓ అధికారి నుంచి నాకు దానిపై సమాచారం వచ్చింది. జులై 29న నేను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొందరికి నచ్చలేదు. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.. అదీ ఛాయ్ బిస్కెట్లతో అని ఛమత్కారంగా ఓ సందేశం ఉంచారాయన.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
పార్లమెంట్‌లో ఈ మధ్య ప్రవేశపెట్టిన.. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభ చర్చ జరిగింది. సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు.
దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ.. ‘‘అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో.. ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారు’’ అని రాహుల్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment