సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు పాలక కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తోంది. సీఎం అశోక్ గెహ్లెట్ సర్వశక్తులూ ఒడ్డుతున్నా అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించలేక సతమతమవుతున్నారు. మొత్తం 200 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 108 మంది ఎమ్మెల్యేలున్నారు. బీఎస్పీ, బీటీపీ వంటి పార్టీలతో పాటు స్వతంత్రులు కలిపి 125 మంది మద్దతుందని కాంగ్రెస్ చెబుతోంది. అందుకే రణదీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీని బరిలో దింపింది. ఒక్కో సీటుకు 41 మంది చొప్పున ముగ్గురినీ గెలుచుకోవడానికి 123 మంది ఎమ్మెల్యేలు కావాలి.
కానీ 71 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ నుంచి ఘన్‌శ్యామ్ తివారీ పోటీలో ఉన్నారు. స్వతంత్రునిగా బరిలో దిగిన మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు బీజేపీ మద్దతివ్వడం కాంగ్రెస్‌లో గుబులు రేపింది. ముందుజాగ్రత్తగా ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించినా సీఎంపై విమర్శలు చేస్తున్న మంత్రి రాజేంద్రసింగ్‌తో పాటు ఐదారుగురు ఎమ్మెల్యేలు వాటికి డుమ్మా కొట్టి చెమటలు పట్టిస్తున్నారు. తన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కావాలంటే 12 డిమాండ్లు తీర్చాలంటూ భారతీయ ట్రైబల్ పార్టీ పేచీ పెడుతోంది. దీనికి తోడు సుభాష్ చంద్రకే ఓటేయాలంటూ కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలకు బీఎస్పీ విప్ జారీ చేసింది! దాంతో 10 జరగనున్న ఎన్నికల్లో ప్రమోద్ గెలుపు ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment