Rahul Gandhi Reaction After Supreme Court Stay His Conviction - Sakshi
Sakshi News home page

వీడియో: శిక్షపై స్టే.. లోక్‌సభకు రాహుల్‌!.. అవిశ్వాసం వేళ కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌.. రియాక్షన్లు

Published Fri, Aug 4 2023 3:52 PM | Last Updated on Fri, Aug 4 2023 4:55 PM

Reactions On Rahul Gandhi SC Relief - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీకి సుప్రీం కోర్టులో దక్కిన ఊరటతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలతో పరువు నష్టం కేసు కారణంగా ఆయనకు సూరత్‌ కోర్టులో రెండేళ్ల శిక్ష పడగా.. ఆ కారణంగానే ఆయన ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రయల్‌కోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ స్టే విధించడంతో ఆయనపై వేటు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే కోర్టు తీర్పు కాపీతో లోక్‌సభ సెక్రటరీని కలిశారు కాంగ్రెస్‌ ఎంపీలు. ఒకవేళ వేటు వెంటనే తొలగిపోతే మాత్రం ఈ సెషన్‌కే ఆయన హాజరయ్యే ఛాన్స్‌ ఉంది. మణిపూర్‌ అంశంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరగనుంది. ఈ తరుణంలో రాహుల్‌ గాంధీకి ఊరట దక్కడంతో కాంగ్రెస్‌ శ్రేణులు మరింత సంబురాలు చేసుకుంటున్నాయి. సత్యమే గెలుస్తుందనే థీమ్‌తో ఆ పార్టీ నేతలంతా రియాక్షన్లు ఇస్తున్నారు. రాహుల్‌ గాంధీ సైతం  ఈ పరిణామంపై స్పందించారు. 

► ‘‘ఏది వచ్చినా.. నా కర్తవ్యం అలాగే ఉంటుంది. దేశాన్ని రక్షించాలన్నదే నా ఆలోచన’’..  అంటూ తీర్పును చాలా తేలికగా తీసుకుంటూ ట్వీట్‌ చేశారాయన. 

ఇవాళ కాకుంటే రేపైనా నిజం గెలుస్తుంది. ఏం జరిగినా నా రూట్‌ క్లియర్‌గా ఉంది. నేనేం చేయాలి.. నా పనేంటనే విషయంలో నాకు క్లారిటీ ఉంది. నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ, నాపై ప్రేమ చూపించిన ప్రజలకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు.

► ఈ పరిణామంపై పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ట్విటర్‌ ద్వారా స్పందించారు. సత్యం ఒక్కటే గెలుస్తుందని ట్వీట్‌ ఖర్గే.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని, ప్రజాస్వామ్యం నెగ్గిందన్నారు. రాహుల్‌ను బీజేపీ కుట్రపూరితంగా వేటాడటం పూర్తిగా బట్టబయలైంది.  విపక్షాలను లక్ష్యంగా చేసుకునే దుర్మార్గపు రాజకీయాలను ఇకనైనా వాళ్లు ఆపేయాలి అంటూ ట్వీట్‌ చేశారాయన. 

రాహుల్‌ గాంధీకి దక్కింది భారీ ఊరటనే. ఆయనపై జరిగిన కుట్ర ఇవాళ విఫలమైంది. స్పీకర్‌ను కలిసి ఆయన్ని పార్లమెంట్‌లోకి అనుమతించాలని గట్టిగా కోరతాం. ఆయన అనర్హత ఎత్తేయాలని గళం వినిపిస్తాం. స్పీకర్‌కు లేఖ రాస్తా అని లోక్‌సభలో కాంగ్రెస్‌ సభా నేత అధిర్‌​ రంజన్‌ చౌదరి తెలిపారు. 

ఇప్పుడు ప్రతీది సవ్యంగా సాగుతుందేమో..

రాహుల్‌ గాంధీ ఊరటపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. ‘‘స్వాతంత్రం వచ్చాక.. పరువు నష్టం కేసులో పూర్తిస్థాయి శిక్ష పడిన మొదటి వ్యక్తి రాహుల్‌ గాంధీనే.  కానీ, దేశ సర్వోన్నత న్యాయస్థానం కింది కోర్టు తీర్పును కొట్టేసింది. ఇప్పుడు ప్రతీది సవ్యంగా సాగుతోంది. రాజస్థాన్‌లోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది 
::: గెహ్లాట్‌

నిజం మాట్లాడేవాడు ఎవరికీ, దేనికి భయపడడు. జనాల మధ్య తిరిగి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకునేవాడు.. రాజు కంటే గొప్పవాడే అవుతాడు అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విటర్‌ వీడియోలతో పోస్టులు పెడుతోంది.  

► సూర్య చంద్రులు, సత్యం.. ఈ మూడూ ఎంతోకాలం దాచబడవు.. అంటూ రాహుల్‌ గాంధీ సోదరి, కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్‌ చేశారు. 

► కాంగ్రెస్‌ సీనియర్‌ జైరాం రమేశ్‌ సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ చేశారు. బీజేపీ యంత్రాంగం ఎంత ప్రయత్నించినా.. రాహుల్‌ గాంధీ లొంగలేదు. న్యాయంపై విశ్వాసం ఉంచాడు. కోర్టు తీర్పు బీజేపీకి, వాళ్ల సహచరులకు ఒక గుణపాఠం. వాళ్లను ఎండగడుతూనే ఉంటాం. రాజ్యాంగ ఆదర్శాలను పాటిస్తుంటాం. కోర్టు తీర్పు సత్యం, న్యాయానికి బలమైన రుజువులు అంటూ  ట్వీట్‌ చేశారు.

► ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్‌.. కాంగ్రెస్‌ నేతలతో కలిసి రాహుల​ గాంధీకి దక్కిన ఊరటపై ‘రాహుల్‌ గాంధీ’నినాదాలతో సంబురాలు చేసుకున్నారు.

► పరువు నష్టం దావా కేసులో శిక్షపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూనే.. తమ పోరాటం కొనసాగిస్తానని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ మీడియాకు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement