అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్‌ ఖేల్‌ ఖతం: రేవంత్‌రెడ్డి | Revanth Reddy Fires On CM KCR | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్‌ ఖేల్‌ ఖతం: రేవంత్‌రెడ్డి

Published Thu, Nov 9 2023 5:07 AM | Last Updated on Thu, Nov 9 2023 8:33 AM

Revanth Reddy Fires On CM KCR - Sakshi

ఆదిలాబాద్‌లో మాట్లాడుతున్న రేవంత్‌ రెడ్డి

సాక్షి, ఆదిలాబాద్‌:  వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్‌ ఖేల్‌ ఖతం అవుతుందని, దుకాణం బంద్‌ అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. డిసెంబర్‌ 9న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వస్తుందని,6గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్వహించిన విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. 

ఆ రెండేళ్లు రైతుబంధు ఎలా ఇచ్చారు? 
‘ప్రజలకు ఏమీ చేయని బీఆర్‌ఎస్‌కు ఓటెందుకు వేయాలి? తెలంగాణ వచ్చినా ఇక్కడి ప్రజలకు నీళ్లు.. నిధులు అందలేదు.. నియామకాలు జరగలే దు. సీఎం అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. ధరణి రాకముందు రెండేళ్లు రైతుబంధు ఎలా ఇచ్చారు? వైఎస్‌ హయాంలో రైతులకు రుణమాఫీ చేయలేదా? పైగా ధరణి తెచ్చి దందాలు చేసి భూములు కొల్లగొట్టారు.

అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో కొత్త మెరుగైన సాంకేతికతను తీసుకొస్తాం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని నిరూపిస్తే మేము నామినేషన్లు కూడా వేయం. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది కాంగ్రెస్సే. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, హనుమంతుడి గుడి లేని ఊరు లేదు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మేము ఓట్లు అడుగుతాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగండి..’అని రేవంత్‌ సవాల్‌ చేశారు.  

బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటే.. 
‘బీజేపీకి ఓటు వేసినా బీఆర్‌ఎస్‌కు వేసినట్టే. ఈ రెండు పారీ్టలు ఒకటే. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అని గతంలో మాట్లాడిన మోదీ.. నిన్న మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేసీఆర్‌ను చూసి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు? కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తెలంగాణకు వచ్చి మోదీ తొండను కూడా పట్టలేకపోయారు. కమీషన్ల కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయింది.. సుందిళ్ల త్వరలో పోతుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ రీడిజైన్‌ పేరుతో లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్‌..’అని ఆరోపించారు. 

గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలి.. 
‘బీజేపీ పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఒక్క రాష్ట్రంలోనే బీసీని సీఎం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ముగ్గురు బీసీలను ముఖ్యమంత్రుల్ని చేసింది. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని చెబుతున్న మోదీ.. ముందు గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలి. తెలంగాణలో బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్‌లో కోట్లు ఉన్నోళ్లకే టిక్కెట్లు ఇస్తారని బీఆర్‌ఎస్‌ సన్నాసులు ప్రచారం చేస్తున్నారు. డబ్బులు లేకపోయినా ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది కనిపించడం లేదా?..’అని రేవంత్‌ ప్రశ్నించారు.  

ఆదివాసీ, లంబాడాల పంచాయితీ తెంచేస్తాం 
‘దళిత, గిరిజనులపై కాంగ్రెస్‌కు ఉన్న ప్రేమ ఇంకెవరికీ లేదు. లంబాడాలు, ఆదివాసీలు నాకు రెండు కళ్ల లాంటివారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వీరి మధ్య ఉన్న పంచాయతీ తెంచుతాం. పోడు భూములకు పట్టాలిచ్చి వాటిని అమ్ముకునే హక్కు కల్పిస్తాం. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత మాది. గిరిజనేతరుల భూములకు రక్షణ కల్పిస్తాం. కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఇస్తే పదేళ్లయినా ఈ ప్రభుత్వం వర్సిటీ ఏర్పాటు చేయలేదు. కేసీఆర్‌ ధన దాహానికి ప్రాణహిత–చేవెళ్ల బలైపోయింది. కడెం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం కడితే.. ఈ ప్రభుత్వం దాని నిర్వహణ చూసుకోలేకపోతోంది..’అని విమర్శించారు.  

టికెట్‌ రానివారికి సముచిత స్థానం 
‘కాంగ్రెస్‌ టికెట్‌ రాని వారికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎవరూ భావోద్వేగానికి లోను కావద్దు.. క్షణికావేశానికి గురికావద్దు.. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో ఓటర్లు తేల్చుకోవాలి. కేసీఆర్‌ను పొలిమేరలు దాటే వరకు తరమాలి..’అని రేవంత్‌ అన్నారు. ఖానాపూర్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే రేఖానాయక్, ఆదిలాబాద్‌ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement