సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలపై ఆధారాలు సమర్పిం చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 17న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కలిసి వచ్చి ప్రభుత్వ అవినీతి గుట్టు విప్పుతామని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, అధికార ప్రతినిధులు బోరెడ్డి అయోధ్యరెడ్డి, సుధీర్‌రెడ్డి, మత్స్యకార కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.
విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి
కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని బీజేపీ అధ్యక్షుడు సంజయ్ చెబుతుంటే, రాష్ట్ర ప్రభు త్వంలోని పెద్దల అవినీతి వ్యవహారాలపై ఆధా రాలు దొరకలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ ఫిర్యాదులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమకు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ తదితర రంగాలకు సంబంధించి తెలంగాణలో జరిగిన అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అన్ని ఆధారాలు అమిత్‌షాకు అందజేస్తామని పేర్కొన్నారు.
తాగుబోతు రాష్ట్రంగా మారుస్తున్నారు
రాష్ట్రం వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందని, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా యని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు పెట్టి తెలంగాణను తాగు బోతు రాష్ట్రంగా మారుస్తున్నారని విమర్శించారు. గంజాయి మత్తులో తెలంగాణ యువత తూగుతోం దన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పాశవిక సంఘట నలకు ఈ వ్యసనాలే కారణమవుతున్నాయని పేర్కొన్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్యకు కూడా ఈ వ్యసనమే కారణమయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన నిందితుడిని గంటల్లోనే పట్టుకున్నారని పోలీసులను అభినందిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్, తర్వాత తన ట్వీట్‌ను సవరించుకుని నిందితుడు దొరకలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంత సీరియస్ ఘటనలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని రేవంత్ అన్నారు. ఈ ఘటనపై వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment