హుజూరాబాద్: ‘ఒకరేమో అసెంబ్లీలో మీ సంగతి తేలుస్తానంటారు. ఇంకొకరు నన్ను టచ్ కూడా చేయలేవంటారు. అసెంబ్లీ నిర్వహించుకునేది ఒకరినొకరు తిట్టుకోవడానికా? ప్రజా సమస్యలు పరిష్కరించడానికా? మీరు తిట్టుకోవాలనుకుంటే హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నేనే బుక్ చేస్తా. తిట్టుకుంటారో, కొట్టుకుంటారో అక్కడే తేల్చుకోండి. అసెంబ్లీని మాత్రం ప్రజలకి చ్చిన హామీలను అమలు చేయడానికి వేదికగా మార్చండి’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
‘గావ్ చలో అభియాన్’కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లో మంగళవారం రాత్రి బస చేసిన ఆయన బుధవారం ఉదయం గ్రామంలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సర్కారు వద్ద పైసల్లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పారని, మరి ప్రజలకిచ్చిన ఆరుగ్యారంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
రేషన్‌కార్డు ప్రాతిపదికన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో పదేళ్లుగా అర్హులైన 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
వారంరోజుల్లో అందరికీ రేషన్‌కార్డులు మంజూరుచేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. కొందరు బీఆర్‌ఎస్ నేత లు హద్దుమీరి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment