యాత్రలో మహిళలతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
బొంరాస్‌పేట/సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాగుబోతు పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లి నుంచి హాథ్‌సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు, భార్యాభర్తలకు వృద్ధాప్య పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాభర్తీ వంటి హామీలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో ధరలు పెంచి పేదలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను పదవుల నుంచి తప్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. వికారాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన దుద్యాల మండల కేంద్రంలో కూడా రేవంత్ యాత్ర కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
పార్టీ ఫిరాయిస్తే ఉరి శిక్ష విధించాలి
బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అపహాస్యం చేశాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన 9 ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని విమర్శించారు.గురువారం ఉదయం ఆయన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని అన్నారు. అవసరమైతే ఉరి వంటి కఠిన శిక్షలను అమలు చేసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రగతిభవన్, రాజ్‌భవన్‌లకు పరిమితం చేసి.. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేశారని విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని హైకోర్టు, ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment