గహ్లోత్, పైలట్‌ షేక్‌హ్యాండ్‌! | Sachin Pilot-Ashok Gehlot Exchange Smiles and Handshakes | Sakshi
Sakshi News home page

గహ్లోత్, పైలట్‌ షేక్‌హ్యాండ్‌!

Published Fri, Aug 14 2020 5:03 AM | Last Updated on Fri, Aug 14 2020 5:06 AM

Sachin Pilot-Ashok Gehlot Exchange Smiles and Handshakes - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో గత నెల రోజులుగా నెలకొన్న సంక్షోభం సమసి పోయింది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ కలసిపోయారు. గహ్లోత్‌ అధికారిక నివాసంలో గురువారం పార్టీ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్, అవినాశ్‌ పాండే, రణ్‌దీప్‌ సూర్జెవాలా, అజయ్‌ మాకెన్‌ల సమక్షంలో ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది.

పైలట్‌తో పాటు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్‌ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లపై విధించిన సస్పెన్షన్‌ను కూడా పార్టీ ఎత్తి వేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని ఆరోపిస్తూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, వారి సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ పాండే గురువారం ట్వీట్‌ చేశారు. సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు  చేసి.. పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తూ జూలై 14న జరిగిన సీఎల్పీ భేటీకి హాజరుకాకపోవడంతో నాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న పైలట్‌ను, పర్యాటక మంత్రిగా ఉన్న విశ్వేంద్ర సింగ్‌ను పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

పైలట్‌ను పీసీసీ చీఫ్‌ పదవి నుంచి సైతం తొలగించారు. తనతో పాటు తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేలను పైలట్‌ గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో ఉంచారు. అనంతరం, ఇటీవల అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో భేటీ అయిన అనంతరం మళ్లీ పార్టీ గూటికి పైలట్‌ తిరిగొచ్చారు. పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు కూడా జైపూర్‌ తిరిగి వచ్చారు. గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మేర్‌ నుంచి జైపూర్‌ వచ్చి, ఇక్కడి ఫెయిర్‌మాంట్‌ హోటల్‌లో ఉన్నారు. ఆగస్ట్‌ 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేవరకు వారు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.  

అపార్థాలను క్షమించాలి.. మరచిపోవాలి
కాంగ్రెస్‌ పార్టీలో అపార్థాలు చోటు చేసుకుంటూనే ఉంటాయని, వాటిని క్షమించి మరచిపోయి, ముందుకు సాగుతూ ఉండాలని ముఖ్యమంత్రి గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. ‘నెల రోజులుగా కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయి. దేశం, రాష్ట్రం, ప్రజాస్వామ్యం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాటిని క్షమించి, మరచిపోయి, ముందుకు సాగాలి’ అని గహ్లోత్‌ ట్వీట్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర ఆట దేశంలో సాగుతోందని బీజేపీపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌  పనిచేస్తోందన్నారు. ‘దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను ఒకటొకటిగా కూల్చే కుట్ర జరుగుతోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్‌లలో అదే జరిగింది. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయవ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని వరుస ట్వీట్లు చేశారు.  

విశ్వాస పరీక్ష
నేటి నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. గెహ్లోత్‌ అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రకటించింది. అయితే, అందుకు కొన్ని గంటల ముందే, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని విపక్ష బీజేపీ ప్రకటించింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని బీజేపీ శాసనసభాపక్ష భేటీ అనంతరం అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్‌ చంద్‌ కటారియా ప్రకటించారు. ‘కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. ఇవన్నీ అసెంబ్లీలో లేవనెత్తుతాం’ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారమే అవిశ్వాస తీర్మానం పెడతామని రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ సతిశ్‌ పూనియా తెలిపారు. ‘గహ్లోత్‌ సర్కారు కోమాలో ఉంది. ప్రభుత్వం స్థిరంగా లేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ అని బీజేపీ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement