
జైపూర్ : రాజస్తాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం సచిన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారానికి కృషి చేసిన సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు.
నెల రోజుల తన తిరుగబాటుపై స్పందిస్తూ.. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన కుటుంబం నుంచి కొన్ని విలువలు నేర్చుకున్నానని, ఎవరిని ఎంత వ్యతిరేకించినా, నేనెప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పైలట్ అన్నారు. అశోక్ గహ్లోత్ తన కన్నా పెద్దవారు అని, ఆయన్ను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, కానీ ప్రభుత్వ పరంగా ప్రశ్నిస్తానని తెలిపారు. తనకు ఎలాంటి పదవి వద్దన్న సచిన్ పైలట్.. అవి వస్తుంటాయి, పోతుంటాయని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని, మనపై వారి నమ్మకాన్ని బలోపేతం చేసే దిశలో మనం పనిచేయాలని సచిన్ పైలట్ తెలిపారు. (చదవండి : సొంత గూటికి పైలట్!)
కాగా, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై అసమ్మతి స్వరం వినిపిస్తూ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తోపాటు మరో 18మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మరోవైపు ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.