సాక్షి, అమరావతి: పూటకో మాట, రోజుకో వేషం చంద్రబాబు నైజంగా మారిందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ గాలి వీస్తోందని చెప్పిన 24 గంటల్లోనే మాట మార్చి ఎన్నికలే బూటకమనడంలో అర్థమేంటని ప్రశ్నిం చారు. అడుగులకు మడుగులొత్తిన ఎన్నికల కమిషన్ వేస్ట్ అనడంపై విస్మయం వ్యక్తం చేశారు. అంపశయ్యపై ఉన్న టీడీపీని కాపాడుకునేందుకు ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సజ్జల ఏమన్నారంటే..
అందుకే ప్లేటు ఫిరాయించారు
‘మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 38.74 శాతం ఓట్లు టీడీపీ గెలిచినట్టు తండ్రీ కొడుకులు చెప్పుకున్నారు. ఆ లెక్కే తప్పని చెబితే బుకాయించారు. దాంతో నిజాలు బయటపెట్టాం. ఎన్నికలు జరిగిన 3,245 పంచాయతీల్లో.. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు 2,616 మంది, రెబల్స్ 26 మంది, టీడీపీ మద్దతుదారులు 510 మంది గెలిచారని చెప్పాం. విజేతలైన మా మద్దతుదారుల వివరాలు ఫోటోలతో సహా బయటపెట్టాం. టీడీపీ వాళ్ళు గెలిచినట్టు చెప్పుకున్న 1,055 పంచాయతీలు లెక్కలు చెప్పమని సవాల్ చేశాం. ఇది చెప్పాల్సి వస్తుందని 24 గంటల్లో ప్లేటు ఫిరాయించారు.
చంద్రబాబు చెప్పేదాంట్లో ఏది నిజం?
ఇప్పుడు అసలు ఎన్నికలే బూటకమంటాడు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా? అంటాడు. ఉన్నా వృ«థా అంట. దాని గొంతు నొక్కేశామట. కేంద్ర బల గాలను, పరిశీలకులనూ పంపాలంటాడు. ఐక్య రాజ్య సమితి దళాలనూ అడిగితే బాగుండేదేమో! కేంద్రానికి రాసిన లేఖలో గవర్నర్‌నూ విమర్శించారు. ఇంతకీ చంద్రబాబు చెప్పేదాంట్లో ఏది నిజం? 1,055 పంచాయతీలు గెలిచింది, 38% ఓట్లు వచ్చింది నిజమా? అలా అయితే లెక్క చూపించాలి..’ అని సజ్జల సవాల్ చేశారు.
ఎప్పట్నుంచో చెబుతున్నాం..
‘రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలను విస్మరిం చిందని ప్రజలు, మేమూ చెబుతూనే ఉన్నాం. ఆయన తెలుగుదేశం చెప్పినట్టల్లా ఆడటం తెలిసిందే. అధికారులను వేధించడంతో పాటు, మాపై ఆంక్షలు పెట్టినా వైఎస్సార్‌సీపీకే జనం పట్టం కట్టారు. టీడీపీ వెంటిలేటర్‌పై ఉందని పంచాయతీ ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. రానురాను వైఎస్సార్‌సీపీ బలం పెరుగుతోంది. వైఎస్ జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకోవడమే దీనికి కారణం’ అని సజ్జల స్పష్టం చేశారు.
వెబ్‌సైట్‌లో విజేతల వివరాలు
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌సీపీ అభిమానుల వివరాలన్నీ ‘వైఎస్సార్‌సీపీపోల్స్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు సజ్జల తెలిపారు. ‘అది మీడియా, ప్రజలకు, అందరికీ అందుబాటులో ఉంటుంది. నియోజకవర్గాలు, మండలాల వారీగా గెలిచిన వాళ్ళ ఫోటోలతో సహా వెబ్‌సైట్‌లో ఉంచాం. రెబల్స్ వివరాలూ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి తప్పున్నా ఛాలెంజ్ చెయ్యొచ్చు. చంద్రబాబు ఇలా పారదర్శకంగా గెలిచిన టీడీపీ మద్దతుదారుల పేర్లు పెట్టగలరా?’ అని సజ్జల సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment