సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు రామోజీ వైట్ కాలర్ నేరాలకు పాల్పడే సయామీ కవలలు అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తమను పెంచిన వారినే కాటేయగలమని నిరూపించారని మండిపడ్డారు. వారిద్దరి నేరాల్లో సారూప్యత, సామీప్యత స్పష్టంగా కనిపిస్తోందని, మోడ్రన్ గజదొంగల ముఠాకు నాయకుల్లా వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.
రామోజీని తమ్ముడిలా చూసుకున్న జీజే రెడ్డి
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు అత్యంత క్రూరంగా వెన్నుపోటు పొడిస్తే వ్యాపారపరంగా తనకు జీవితాన్ని ఇచ్చిన జీజే రెడ్డి షేర్లను కొట్టేసి రామోజీ వంచనకు పాల్పడ్డాడు. కొండపల్లి సీతారామయ్య రిఫరెన్స్‌తో జీజే రెడ్డి వద్ద టైపిస్టుగా ఉద్యోగంలో చేరిన రామోజీ 1960ల్లో ఆయన దగ్గర రూ.5 వేలు తీసుకుని మార్గదర్శి చిట్ ఫండ్స్‌ను ప్రారంభించాడు. ఆ పెట్టుబడితో జీజే రెడ్డిని ప్రమోటర్ డైరెక్టర్‌గా షేర్లు అలాట్ చేశారు. ఆ షేర్లు 2016 వరకూ కొనసాగాయి. ఇందులో ప్రతి ఒక్కటీ వాస్తవమే అని రామోజీనే అంగీకరిస్తున్నాడు. తనను చిన్న తమ్ముడిలా చూసుకున్న జీజే రెడ్డికి డబ్బులు ఎలా ఎగ్గొట్టాలా అని రామోజీ చూశాడు.
ఆయన కుమారులను తుపాకీతో బెదిరించి స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. జీజే రెడ్డిని ముంచేసి తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆయన చెబుతున్నట్లు 228 షేర్ల విలువ రూ.2.88 లక్షలే అయితే రామోజీ షేర్లు అన్నీ అదే రేటుకు ఇవ్వగలరా? నువ్వు బంగారు సింహాసనం మీద కూర్చుని జీజే రెడ్డి కుమారులను రోడ్డుపై నిలబెట్టావు. జీజే రెడ్డి నీకు చేసిన సాయానికి ఎంతో చేసి ఉండాల్సింది. నీకు వస్తున్న లాభాల్లో జీజే రెడ్డి కుమారులకూ వాటా రావాలి.
పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ, మార్గదర్శకులం అని చెప్పుకుంటూ ఇలాంటి నీచమైన పనులు చేశారు. ఆయన అక్రమ సామ్రాజ్యం అంతా ఇలా వచ్చిందే. జీజే రెడ్డి షేర్లను కాజేయడం రామోజీ ఆరి్థక నేరాల్లో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మార్గదర్శి టర్నోవర్ రూ.1,200 కోట్లు అని రామోజీరావే చెబుతారు. మరి అంత టర్నోవర్ ఉంటే ఇన్నేళ్ల బిజినెస్‌కు కేవలం రూ.39 లక్షల డివిడెండ్ మాత్రమే జీజే రెడ్డి కుమారులకు వచ్చిందా? డబ్బు పెట్టిన జీజే రెడ్డి మెయిన్ ప్రమోటర్ అవుతాడు. అంతా ఆయన కుమారులకే వెళ్లాలి.
తప్పించుకునే యత్నాలు..
చంద్రబాబు 1995లో సీఎం అయ్యిందే సంపాదన కోసం అన్నట్లు ప్రవర్తించాడు. సీఎం అయిన రెండు నెలలకే చట్టాల్లో మార్పు చేసి డిఫర్డ్ టాక్స్ పేరుతో ప్రజల సొమ్ము రూ.ఆరేడు కోట్లు తీసుకుని దాని మీదే హెరిటేజ్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికీ ప్రజల సొమ్మును ప్రభుత్వానికి చెల్లించలేదు. స్కిల్ స్కామ్‌లో ఖజానా నుంచి రూ.371 కోట్లు కాజేసి రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా మళ్లించి జేబులో వేసుకున్నాడు. తన పీఎస్‌ను గుట్టుగా దేశం దాటించేశారు.
బాబు ఆరోగ్యంపై జైలు అధికారుల నివేదికను టీడీపీ నేతలే లీక్ చేశారు. ప్రిజనర్స్‌కి ఎవరైనా రోజూ హెల్త్ బులిటెన్ ఇస్తారా? ఆయన కోర్టు కస్టడీలో ఉన్నందున దీనిపై న్యాయస్థానంలోనే అడగాలి. చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులే బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడుతున్నారు. ములాఖత్‌లో రోజుకు ఒకసారికి మించి వాళ్ల లాయర్లు ఏం మాట్లాడతారు? చంద్రబాబు విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా సాంకేతిక కారణాల సాకుతో తప్పించుకునే యత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment