సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం సకాలంలో సమస్యలు పరిష్కరించడాన్ని టీడీపీ, వామపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఉద్యోగులు సమ్మె చేయకపోవడం వల్ల రాజకీయంగా పేలాలు ఏరుకోలేకపోయామనే దుగ్ధతో విపక్షాలు నిస్పృహలో కూరుకుపోయాయన్నారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి సంతకాలు చేసి సమ్మెను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు పీఆర్సీ సాధన సమితి ప్రకటించిందని గుర్తు చేశారు.
వామపక్షాలకు అనుబంధంగా వ్యవహరించే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆ ప్రతిపాదనలకు తాము అంగీకరించడం లేదని, దశలవారీగా సమ్మె చేస్తామని చెప్పడం సబబు కాదన్నారు. చర్చలకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఉపాధ్యాయ సంఘాల నేతలకు సూచించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అధికారం నుంచి దించి చంద్రబాబును పీఠంపై కూర్చోబెట్టేందుకు తాపత్రయపడుతున్న ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 లాంటి టీడీపీ అనుకూల మీడియా లేని సమస్యను ఉన్నట్లు చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆర్థిక పరిస్థితి వల్లే..
రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్లకు బదులు కోవిడ్‌తో రూ.62 వేల కోట్లకు తగ్గిపోయింది. మరోవైపు ఉద్యోగుల వేతనాల వ్యయమే రూ.70 వేల కోట్లు (111 శాతం) దాటిపోయింది. అందువల్ల ఇంతకంటే చేయలేని నిస్సహాయత. పేదల సంక్షేమానికి నేరుగా నగదు బదిలీతో మేలు చేకూరుస్తున్నాం. సంక్షేమ పథకాలకు వ్యయం చేయడం తప్పా? దుబారానా? ధైర్యం ఉంటే చెప్పండి? ఫిట్‌మెంట్ 30 శాతానికిపైగా ఇవ్వాలనుకున్నా కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు తగ్గట్టుగా లేవు.
సమంజసమేనా?
అన్ని సంఘాలు సమ్మె విరమించుకుంటున్నామని ప్రకటించాక వామపక్షాలకు అనుబంధంగా ఉండే ఉపాధ్యాయ సంఘాలు 27 శాతం ఫిట్‌మెంట్, 12 శాతం హెచ్‌ఆర్‌ఏ కావాలని కోరడం సమంజసమేనా? ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. 3.10 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి గత సర్కారు ఏటా రూ.1,198 కోట్లు వెచ్చిస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3,187 కోట్లకు పెరిగింది.
కేరళలో హెచ్‌ఆర్‌ఏ ఎంత?
కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మినిమమ్ టైమ్ స్కేల్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నాం. సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పాక కూడా కొందరు ఉద్యమం చేస్తామనడంలో అర్ధ రహితం. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హెచ్‌ఆర్‌ఏ ఎంత శాతం ఉంది? కేరళలో ఇస్తున్న హెచ్‌ఆర్‌ఏ కేవలం 4–6–8 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాలే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఎక్కువ ఇస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి.
బెదిరింపులు.. బాబు లక్షణమే
ఉద్యోగులను ఎందుకు బెదిరిస్తాం? మాకెందుకు అంత అవసరం? బెదిరించింది ఎవరు? బెదిరేవాళ్లు ఎవరు? అవన్నీ చంద్రబాబు లక్షణాలే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నçప్పుడు ఉద్యోగులను ఏవిధంగా బెదిరించారో అందరికి తెలిసిందే.
బాలిక చనిపోతే స్పందనేది పవన్?
ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. విజయవాడలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు తాళలేక ఓ బాలిక చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? సమ్మె జరగలేదనే బాధ, దుగ్ధ, టీడీపీకి ఉపయోగపడలేదనే ఆక్రోశంతో ఆయన అలా మాట్లాడుతున్నట్లున్నారు.
అభివృద్ధికే వెచ్చిస్తాం
అమరావతి భూములను చంద్రబాబు సర్కారు ఏకంగా విక్రయించాలనే చూసింది. మేం అవసరం కోసం వినియోగిస్తూ వచ్చిన నిధులతో అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఏది మేలు అనేది వాళ్లే ఆలోచించుకోవాలి. గుడివాడలో జరిగిన సంక్రాంతి కార్యక్రమాలను టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వరకూ తీసుకెళ్లడం హాస్యాస్పదం.
Comments
Please login to add a commentAdd a comment