సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘‘సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారు. మూడోసారి సీఎం కావాలనుకుంటున్న ఆయన కలలను కల్లలు చేయడమే లక్ష్యంగా.. ఆయన వల్ల నష్టపోయిన వారమంతా ఐక్యంగా ముందుకు కదలాలన్న ఆలోచన చేస్తున్నాం. వచ్చే నెల మొదటి వారంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటా..’’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఒక్క బీఆర్‌ఎస్ అభ్యర్థిని కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించుకోలేదని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్యనేతలతో చర్చిస్తున్నానని తెలిపారు. ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..
తెలంగాణ బిడ్డల కలలు కల్లలయ్యాయి
ప్రత్యేక రాష్ట్రమొస్తే ఉద్యోగాలు వస్తాయని, ఆత్మగౌరవంతో బతుకుతామని తెలంగాణ బిడ్డలు కలలు కన్నారు. కానీ అవన్నీ కల్లలు అయ్యాయి. ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినవారి సమాధుల మీద కేసీఆర్ అంతస్తులు కట్టుకుని ఆనందిస్తున్నారే తప్ప అమరులను పట్టించుకోవడం లేదు.
గెలవనివ్వను..: మాటల గారడీ చేస్తూ, ప్రజ లను మభ్యపెడుతూ మళ్లీ గెలవాలని కేసీఆర్ కంటు న్న పగ టి కలలను కల్లలుగా మిగుల్చుతానని శపథం చేస్తున్నా.. ఇది నా శపథం కాదు.. ఖమ్మం జిల్లా ప్రజల శపథం.
కేసీఆర్‌కు వివరించే ప్రయత్నం చేసినా.. వినలేదు
గత ఎన్నికల్లో నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఓడించి ఉంటే.. అప్పుడే నన్ను సస్పెండ్ చేయాల్సింది. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలకు కారణాలను కేసీఆర్‌కు వివరించే ప్రయత్నం చేశా. కానీ వారికి వినే ఓపిక లేదు.
సమయం వచ్చినప్పుడు మీ స్థిరాస్తులూ చూపిస్తా..
నాకు వేల కోట్ల పనులు ఇచ్చారని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. 2018 ఎన్నికల తర్వాత శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన కంపెనీకి ఒక్క వర్క్‌ను ఎక్సెస్‌లోగానీ, ఎస్టిమేట్ రేట్‌లోగానీ ఇప్పించి ఉంటే.. నేను దేనికైనా రెడీ. 2018 వరకు మా కంపెనీ చేసిన పనులు రూ.1,700 కోట్లు. అందు లోనే వందల కోట్లు మిగిలాయని మీరు అంటుంటే.. మరి రాష్ట్రం వచ్చాక మీరు రూ.లక్షా 80వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. అందులో ఎంత మిగిలాయి, మీకు ఎన్ని వేలకోట్లు మీకు ఇచ్చారు? సందర్భం వచ్చినప్పుడు నేను లెక్కలు చెప్తా.. ఎక్కడైనా మీరు స్థిరాస్తులు దాచుకొని ఉంటే అవన్నీ నేను చూపిస్తా.
డబ్బుతో బీఆర్‌ఎస్ రాజకీయం
సుమారు రూ.5 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్తున్నారు. వాటికి సంబంధించి ఎన్ని లక్షల కోట్లు మీకు కమీషన్ రూపంలో వచ్చింది? ప్రజలు డబ్బుకు అమ్ముడుపోవడమో, డబ్బుతో రాజకీయాల్లో సక్సెస్ కావడమో ఉత్తమాటే. బీఆర్‌ఎస్ పెట్టి దేశవ్యాప్తంగా డబ్బుతో రాజకీయం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారు.
అవమానించినా.. కేటీఆర్ కోసం ఆగాను
2014లో ఫలితాలు రాకముందే టీఆర్‌ఎస్‌లోకి రావాలని మంత్రి కేటీఆర్ మమ్మల్ని అడిగారు. మీకు సరిపోను మెజార్టీ ఉందకదా అని మేం వెళ్లలేదు. నాకు కేసీఆర్ మీద ఎన్నడూ పూర్తిగా నమ్మకం లేదు. కానీ కేటీఆర్ మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. నన్ను బీఆర్‌ఎస్‌లోకి తీసుకొచి్చంది కేటీఆరే. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా, నా వెంట ఉన్న నేతలను ఇబ్బందిపెట్టినా, అవమానించినా ఇటీవలి వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్నాను. దానికి కారణం కేటీఆరే. చాలా సంద ర్భాల్లో ఆయన నాకోసం ఫైట్ చేశారు. కానీ ఫలితం లేదు.
అందరం ఐక్యంగా కదులుతాం
కేసీఆర్ ద్వారా నష్టపోయినవారితోపాటు ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు కూడా ఆత్మగౌరవాన్ని కోల్పోయా మన్న బాధలో ఉన్నారు. అలాంటి వారమంతా ఐక్యంగా ముందుకుపోవాలన్న ఆలోచన ఉంది. ఇప్పటివరకు కొత్త పార్టీ ఆలోచన లేదు. వచ్చేనెల మొదటి వారం నాటికి ఒక నిర్ణయానికి వస్తా.
ఆ రెండు పార్టీలు ఆహ్వానించాయి
కాంగ్రెస్, బీజేపీ నన్ను వారి పార్టీలోకి ఆహ్వానించాయి. అయితే కేసీఆర్‌తో నష్టపోయిన వాళ్లంతా కూడా ఒక సమీకరణ చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ సమీకరణగానీ, జాతీయ పార్టీలుగానీ.. ఏదో ఒక నిర్ణయం త్వర లో తీసుకుంటా. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రెండు కలిపి వస్తే ఆలోచిస్తా. విడిగా వస్తే అసెంబ్లీకి పోటీచేస్తా.
Comments
Please login to add a commentAdd a comment