
తిండికి తిమ్మరాజులు.. పనికి పోతురాజుల అనే బ్యాచ్ ప్రతిచోటా ఉంటుంది.. కాలం గడిచేకొద్దీ కొందరు తమ గ్లోరీని.. పాత వైభవాన్ని. కోల్పోతుంటారు.. కొత్తనీరొచ్చి పాత నీటిని అడుక్కు నెట్టేసినట్లు.. కొత్త ఆటగాళ్లొచ్చి సీనియర్ ఆటగాళ్లను కామెంటేటర్లుగా మార్చేసినట్లు.. ఒకనాటి హీరోలు మెల్లగా తండ్రి పాత్రలోకి అడిగినట్లు.. ఆయనతో వన్నె చిన్నెల హీరోయిన్లు అత్తా.. అమ్మ పాత్రలోకి మారినట్లు.. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే జరుగుతోంది.
మేము ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఆరోజుల్లో మా స్థాయి వేరు.. మేము ముఖ్యమంత్రులతో.. కాఫీలు తాగినామ్.. ప్రధానులతో ఫోటోలు దిగినామ్ అంటే.. అవును దిగినారు నిజమే... మీది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నది కూడా నిజమే... అంటే మీరు సీనియర్లు.. క్లియరుగా చెప్పాలంటే ముసలోళ్ళు.. అందుకే పక్కకు జరిగితే కొత్త మొహాలు.. కొత్త నాయకులూ...ఆటగాళ్లు వస్తుంటారు అన్నది కూడా నిజమే అని నయా జమానా అంటోంది.
తెలుగుదేశంలో కూడా అలాంటి బ్యాచ్ ఒకటి తయారైంది. గతంలో పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళు కొందరు ఇప్పుడు సీనియర్లు అయిపోయారు.. అంటే వాళ్ల ప్రభ తగ్గింది.. వారిమీదున్న ఇమేజీ కోల్పోవడం కావచ్చు.. ప్రజాదరణ తగ్గడం.. కొత్తవాళ్లు రావడంతో వీళ్ల పట్ల ప్రజల్లో పెద్దగా మోజు లేకపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో వాళ్లను పక్కనబెట్టాల్సిన అవసరం. టీడీపీ అధినాయకత్వానికి ఏర్పడుతోంది. అంటే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేరన్నమాట... అలాని నేరుగా నీకు టిక్కెట్ లేదు అంటే ఊరుకోరు..
ఆయ్... నేను నీతోబాటు రాజకీయాల్లోకి వచ్చాను అంటూ చంద్రబాబు మీదకే కత్తులు దూసే టైప్ అన్నమాట.. అలాగని వాళ్ళను ఉపేక్షిస్తూ.. టిక్కెట్లు ఇస్తే ఓడిపోతారు.. అందుకని ఆలపాటి రాజాకు తెనాలిలో టిక్కెట్ ఇవ్వలేకపోయారు. అక్కడ జనసేన నంబర్ టూ మనోహర్ పోటీలో ఉన్నారు.. పార్టీలో కీలకనాయకుడికే టిక్కెట్ ఇవ్వకపోతే ఇక పార్టీని ఏమి నడుపుతారులే అనే ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం పవన్ చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి ఆలపాటి రాజేంద్రప్రసాదుకు టిక్కెట్ ఆపగలిగారు.. దీంతో అయన ఇప్పుడు పార్టీమీద రంకెలు వేస్తున్నారు.. ఇక జనంలో తొడగొట్టి మీసం తిప్పిన పెందుర్తి మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు టిక్కెట్ లేదు.. ఆయనమీదున్న వ్యతిరేకతను భరించలేక టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో అయన ఆవేదన, అవమానభారంతో ఆస్పత్రిపాలయ్యాడు.
మైలవరం నుంచి మంత్రి అయిన దేవినేని ఉమాకు నో టికెట్. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడ.. మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావుకు సైతం నో టిక్కెట్.. ఆయన బాగా సీనియర్ అయిపోయారు.. ఇప్పుడు వీళ్ళతో చంద్రబాబుకు కొత్త చిక్కొచ్చింది.. వాళ్లకు టిక్కెట్లు ఇస్తే నేరుగా ఓడిపోతారు.. వాళ్ళను కాదంటే పార్టీ ప్రకటించిన అభ్యర్థిని ఓడిస్తారు.. వీళ్ళతో పెద్ద చిక్కొచ్చి పడింది అని చంద్రబాబు బుర్రబాదుకుంటున్నారు.
-సిమ్మాదిరప్పన్న
ఇదీ చదవండి: రూల్స్ ఫర్ ఫూల్స్.. రాజకీయాల్లో చంద్రబాబు నైజమిదే..!
Comments
Please login to add a commentAdd a comment