కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. రోజుకొక పరిణామం ఆ పార్టీ నాయకత్వానికి కునుకులేకుండా చేస్తోంది. సీనియర్ నేతలు బాధ్యతలు మాకొద్దు బాబో అని తప్పుకుంటున్నారు. పార్టీ కీలక పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు సీనియర్లు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయంగా మారింది.
ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే ఆనంద్ శర్మ ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పుకోవడం పార్టీకి పెద్ద షాకే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ కు కాంగ్రెస్ సిద్ధం మవుతున్న దశలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెబుతున్నారు.
ఆనంద్‌శర్మ, ఆజాద్ ఇద్దరూ... జీ-23 గ్రూపులో కీలక సభ్యులుగా ఉన్నారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు తేవాలని.. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు ఎన్నికైన కార్యవర్గాలు ఉండాలని కొంతకాలంగా జీ-23 గ్రూప్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచింది. ఈమేరకు రెండేళ్ల క్రితమే పార్టీ చీఫ్ సోనియాగాంధీకి ఈ గ్రూపు నేతలు లేఖలు కూడా రాశారు. పార్టీలో అవమానం జరిగిందని.. తన గౌరవానికి భంగంకలిగితే సహించేదిలేదంటూ... సోనియాకు రాసిన రాజీనామా లేఖలో ఆనంద్‌శర్మ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించడం కొసమెరుపు.
అయితే పార్టీని ధ్వంసం చేయడానికి కాంగ్రెస్‌లోనే అంతర్గత కుట్ర జరుగుతోందని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్‌శర్మ చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇద్దరు గాంధీలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం కావాలా? అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై ఎటాక్ చేశారు. గత కొన్నాళ్లుగా ఎంతోమంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. సుమారు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో అనుబంధమున్న కపిల్ సిబల్ లాంటి వారు కూడా ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు.
ఎస్పీ మద్దతులో స్వతంత్ర అభ్యర్ధిగా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. కాంగ్రెస్ పంజాబ్ రాష్ట్రశాఖ చీఫ్ సునీల్ జాఖడ్ కూడా 50 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరారు. కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి అశ్వనీకుమార్, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కూడా హస్తం పార్టీలో ఇమడలేమంటూ బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కూడా పార్టీతో కటీఫ్ చేసుకున్నారు. ప్రజల సెంటిమెంట్లను కాంగ్రెస్ గౌరవించలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
చదవండి: కాంగ్రెస్‌లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతల ఫైటింగ్
గత ఏడాది పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బతీసింది. పంజాబ్ లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. అధికారాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాద కూడా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ లాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి.
2024లో లోక్‌సభకు ఎన్నికలున్నాయి. కీలకమైన ఈ తరుణంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నాయి. పార్టీని ఎలా దారిలో పెట్టాలో కూడా కాంగ్రెస్‌కు సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కొన్నాళ్లుగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఘోరంగా విఫలమవుతుండడం కూడా కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు.
-బొబ్బిలి శ్రీధరరావు, సాక్షి ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment