సాక్షి, హైదరాబాద్: బీజేపీ ముఖ్యనేతలు కొందరు తరచూ సమావేశం కావడం పార్టీ లో కలకలం సృష్టిస్తోంది. అసంతృప్త నేతలుగా భావిస్తున్న వీరంతా ఇటీవలి కాలంలో రెండు, మూడుసార్లు భేటీ అవడంతో.. వీరెందుకు సమావేశమవుతున్నారు? ముఖ్యోద్దేశమేమిటి? అనే చర్చ సాగుతోంది. పార్టీని వీడెందుకేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్టు జరుగుతున్న ప్రచారం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
అయితే బీఆర్‌ఎస్‌తో బీజేపీకి దోస్తీ లేదని అధినాయకత్వం సుస్పష్టం చేయడంతో పాటు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణ కమిటీ వేయడం, తదితర చర్యలు తీసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు, పార్టీ కేడర్‌కు స్పష్టత ఇవ్వాలనేది కొందరు నేతల డిమాండ్‌గా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కొందరు నేతలు ఏకంగా మోదీ, అమిత్‌షా, ఇతర జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పు బట్టడమే కాకుండా, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యతనివ్వకపోవడం లాంటి అంశాలను లేవనెత్తుతుండడంతో..అసలు ఏం జరుగుతోంది? అనే సందేహాలు రాష్ట్ర
నేతలను, పార్టీ కేడర్‌ను పట్టి పీడిస్తున్నాయి.
ఫామ్‌హౌస్‌లో పలు అంశాలపై చర్చ తాజాగా ఆదివారం నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు తదితరులు హాజరైనట్లు సమాచారం. త్వరలోనే ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిసి తమ అభిప్రాయాలను స్పష్టం చేయాలని, తాము చేసిన సూచనలకు అనుగుణంగా జాతీయ నాయకత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణపై నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వీరు వచ్చినట్టుగా తెలుస్తోంది.
రాష్ట్ర పార్టీ లో జరుగుతున్న పరిణామాలు, తమ ప్రమేయం, సంబంధం లేకుండానే కొందరిని బీజేపీలో చేర్చుకోవడం, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు జాతీయ నాయకత్వం అత్యధిక ప్రాధాన్యతనివ్వడం.. ముఖ్యనేతలుగా, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా అవమానించే పద్ధతుల్లో వ్యవహరించడం తదితర అంశాలు ఫామ్‌హౌస్ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సోమవారం పలువురు నేతలు, తన శ్రేయోభిలాషులు, అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీలోనే కొనసాగాలా? కాంగ్రెస్‌లో చేరాలా.. వద్దా? వంటి అంశాలపై చర్చించేందుకే ఈ భేటీ నిర్వహిస్తున్నారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment