ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి మొదలైంది. 175 అసెంబ్లీ స్థానాలకు వందలాది మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. అందులో మాజీ క్రీడాకారులు.. సినిమా నటులు.. పారిశ్రామికవేత్తలు.. వ్యాపారాలు.. ఫక్తు రాజకీయ నాయకులతోబాటు డాక్టర్లు.. లాయర్లు.. ఇంజినీర్లు.. ఉపాధ్యాయులు.. జర్నలిష్టులు ఉన్నారు. ఇలా వివిధ వృత్తుల్లోని వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వీరితోపాటుగానే కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లు కూడా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇదంతా ఇలా ఉండనీయండి కానీ ఈ రాష్ట్రాన్ని కొన్నేళ్లపాటు పాలించిన ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి సైతం తరువాతి తరం వాళ్ళు పోటీకి సిద్ధం అంటున్నారు. ఈ జాబితాలో చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసినవారి కుమారులు ఆరుగురు ఈసారి ఎన్నికలబరిలో నిలుస్తున్నారు.
1. వైఎస్సార్ కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (పులివెందుల- వైఎస్సార్‌సీపీ)
2. ఎన్టీయార్ కుమారుడు నందమూరి బాలకృష్ణ (హిందూపూర్- టీడీపీ)
3. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ (తెనాలి- జనసేన)
4. నారా చంద్రబాబు కుమారుడు (లోకేష్- టీడీపీ)
5. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ (వేంకటగిరి - వైయస్సార్ కాంగ్రెస్)
6. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి (డోన్ - టీడీపీ)
►ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కడప నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. 2019లో మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇప్పడు మూడోసారి గెలిచేందుకు సన్నద్ధం అవుతున్నారు.
►బాలకృష్ణ హిందూపురంలో ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇప్పుడు మూడోసారి బరిలో దిగి ప్రజల మద్దతుకోరుతున్నారు.
►లోకేష్ ఐతే 2019లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోగా ఈసారి ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
►కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గతంలో 1991, 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో రైల్వే శాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు డోన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
►నేదురుమల్లి రామ్ కుమార్ తొలిసారిగా వేంకటగిరి నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. గతంలో ఆయన తల్లి రాజ్య లక్ష్మి అక్కడి నుంచే గెలిచి విద్యాశాఖా మంత్రిగా పని చేశారు.
►నాదెండ్ల మనోహర్ 2004, 2009లో కాంగ్రెస్ తరఫున తెనాలి నుంచి అసెంబ్లీకి ఎన్నికై కొన్నాళ్లపాటు అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పని చేశారు. ఇప్పుడు ఆయన మళ్ళీ తెనాలి నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు.
అయితే, తాత, తండ్రుల పేర్లు చెప్పుకుని గెలిచే రోజులు కావివి.. నువ్వేమిటి.. సమాజానికి నువ్వేం చేసావ్.. నువ్వేం చేస్తావ్ అని చెప్పుకుంటే తప్ప ప్రజామోదం దక్కని రోజులివి. మరిప్పుడు వీళ్ళలో ఎవరిని ప్రజలు ఆదరిస్తారో.. ఆరాధిస్తారో చూడాలి.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment