ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్  | YSRCP Will Contest Single In AP Assembly Elections | Sakshi
Sakshi News home page

ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్ 

Published Sun, Jan 7 2024 1:52 PM | Last Updated on Wed, Jan 31 2024 4:26 PM

YSRCP Will Contest Single In AP Assembly Elections - Sakshi

అటు వైపు ఎంతమంది ఉన్నారన్నది కాదు.. వాళ్ళు ఎదుర్కొంటున్నది ఎవరిని అన్నది ముఖ్యం. అటు ఎంతమంది గుంపు కడుతున్నారు అంటే ఇటువైపు ప్రత్యర్థి అంత బలంగా ఉన్నట్లు వాళ్ళు అంగీకరించినట్లే.. విలన్ గ్యాంగ్ ఎంత ఎక్కువ ఉంటే హీరో అంత బలవంతుడు అని చెబుతున్నట్లే..

ఇప్పుడు ఆంధ్రాలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం గతంలో ఎప్పుడో చూసిన పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి కదా.. అవును నిజమే అప్పట్లో 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు TDP+TRS+CPI+CPM కలిసి మహా కూటమి ఏర్పాటు చేశాయి.  మరోవైపు, చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు సైతం ఆరోజుల్లో గొప్పగానే కనిపించేది. దాదాపు చిరంజీవి ముఖ్యమంత్రి అయినట్లే అని ప్రచారం నడిచింది. చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్‌కు కాపులు దూరం అయినా వీటన్నింటినీ అడ్డుకుని మళ్లీ ఆనాడు వైయస్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరేసింది.

అంతేకాకుండా ఆనాడు రెండోసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో 33 సీట్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రా నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు. ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మొత్తం 294 స్థానాలకుగాను కాంగ్రెస్-157, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌, వామపక్షాలు కలిసివచ్చిన మహాకూటమి -106 స్థానాల్లో గెలవగా ప్రజారాజ్యం-18, ఇతరులు 13 సీట్లు గెలిచారు. అంతిమంగా వైఎస్సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు సమర్ధుడైన నాయకుడు నిలబడితే అటు ఎంతమంది నిలబడినా ముందుగా అరుపులు కేకలు వినిపిస్తాయి. ఒక్కసారి రాజు కత్తి దూస్తే ఆనక వినిపించేవి ఆర్తనాదాలే. 

హిస్టరీ రిపీట్‌.. 
చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు. అంటే గతంలో జరిగిన సంఘటనలు.. సన్నివేశాలు మళ్లీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంటే ఫలితాలు కూడా మళ్లీ అలాగే వస్తాయి అన్నమాట. ఆ సిద్ధాంతం ప్రకారం 2009లో జరిగినట్లుగానే రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ+జనసేన ప్రస్తుతం పొత్తులో ఉండగా బీజేపీని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. ఇంకా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి తమతో కలిసిరావాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నోరకాలుగా బీజేపీని తమతో కలుపుకునేందుకు చంద్రబాబు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.

ఇక కమ్యునిస్టులను సైతం తమతో తీసుకుపోయేందుకు కూడా వెనుకడరు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు వద్దని ప్రజలే తమకు మద్దతుదారులు అని.. చెబుతూ తన అంతర్గత సర్వేలు.. నివేదికలు.. లెక్కలు వేసుకుంటూ ఒక్కో నియోజకవర్గాన్ని క్లియర్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇటు చంద్రబాబు జనసేనలో ఎవరికీ ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలలేదు. కాపుల మద్దతు టీడీపీకి ఉంటుందా లేదా? అన్నది కూడా ఇంకా కొలిక్కి రాలేదు.  మొత్తానికి అటువైపు గుంపుగా వస్తుండగా జగన్ మాత్రం సంక్షేమం.. అభివృద్ధి తనను గెలిపిస్తాయి అంటూ సింగిల్‌గా వెళ్తున్నారు. అప్పట్లో వైఎస్సార్‌ సాధించినట్లే సింగిల్‌ హ్యాండ్ విజయం సాధిస్తాం అని జగన్, ఆయన సైన్యం గట్టిగా నమ్ముతూ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు.
-సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement