సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు (17వ లోక్‌సభకు 13వ సెషన్, రాజ్యసభకు 261వ సెషన్) జరుగుతాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్‌లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం బయట పెట్టలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆ మరుసటి రోజే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం.
కొత్త భవనంలోనే సమావేశాలు
ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మే 28న ఈ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిఏటా మూడుసార్లు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి ప్రత్యేక సమావేశాల వెనుక కారణంగా ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం.. ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్‌ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. దానికి అనుగుణంగానే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్–డిసెంబర్‌ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఏకంగా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది.
పెండింగ్‌లో ఉన్న బిల్లుకు మోక్షం!
మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్‌లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, రాజకీయ అవసరాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రయాన్–3 మిషన్ చరిత్ర సృష్టించడం, ‘అమృతకాలం’లో భారతదేశ లక్ష్యాలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రజల దృష్టిని మళ్లించడానికే: జైరామ్ రమేశ్
ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశాలు, అదానీ గ్రూప్‌లో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల పేరిట మోదీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాల వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వారాల క్రితమే ముగిశాయని, ఇంతలోనే మళ్లీ భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని జైరామ్ రమేశ్ చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు.
ఆ బిల్లుల ఆమోదానికేనా?
వన్ నేషన్–వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మ డి పౌరస్మృతి(యూసీసీ) బిల్లులను మోదీ ప్రభు త్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇందులో వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం వచ్చే ఏడాది జరిగే సార్వ త్రిక ఎన్నికలను ముందుకు జరపడమేనని రాజకీ య పరిశీలకులు చెబుతున్నారు.
ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై బలమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే యత్నాల్లో ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ విధానమే మార్గమని బీజే పీ నాయకులు అంటున్నారు.
దేశమంతటా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అమలుకు కనీసం 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయాలి. అందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశం జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యా య శాఖ మంత్రి మేఘ్వాల్ గతంలోనే చెప్పారు.
ప్రత్యేక సమావేశాలు కొత్తేమీ కాదు
పార్లమెంట్ బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు కాకుండా, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. 2017 జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. కానీ, ఇది లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం. 50వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టులో ఆరు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1992 ఆగస్టు 9న, స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1972 ఆగస్టు 14–15న అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment