పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తేనే దిక్కులేదు.. ఇప్పుడు మీరు పోటీ చేసి ఏం గెలుస్తారు? గాజువాకలో జనసేన నేతలపై టీడీపీ నాయకులు సెటైర్లు పేలుస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేశారు కనుక ఈసారి గాజువాక తమకే ఇవ్వాలని జనసేన నేతలు పట్టుపడుతున్నారు. పవన్ గెలవలేనపుడు మీకు సీటు ఎందుకివ్వాలని టీడీపీ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సిగపట్లు మొదలయ్యాయి. ఇంకా రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు మొదలు కాకముందే గాజువాకలో గలాటా మొదలైంది. అసలక్కడ ఏం జరుగుతోందో చూద్దాం.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబుకు కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం గాజువాకలో సొంత పార్టీ అభ్యర్థికే చంద్రబాబు ప్రచారం చేయలేదు. పక్క నియోజకవర్గంలో ప్రచారం చేసి పవన్ పోటీ చేస్తున్న గాజువాకలో టీడీపీకి ప్రచారం చేయకుండా వెనుదిరిగారు. గత ఎన్నికల్లో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈసారి గాజువాక తమకే కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు.
జనసేన తరఫున పోటీ చేయడానికి కోన తాతారావు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన తరఫున ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోన తాతారావు. గాజువాకలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొదటినుంచి పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నానని అవకాశవాద రాజకీయాల కోసం తానేమి పార్టీలోకి కొత్తగా రాలేదంటున్నారు. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచి పదవులు అనుభవించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా తమ నాయకుడు జనసేనలోకి రాలేదని కోన తాతారావు అనుచరులు గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గాజువాకలో పోటీ చేయాల్సిందే అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ క్యాడర్ మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్‌కి మద్దతు తెలిపిందని చెబుతున్నారు. అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన గాజువాక సీటును మళ్లీ ఎందుకు జనసేనకి ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. జనసేనతో పోలిస్తే టీడీపీనే ఇక్కడ బలంగా ఉందంటున్నారు. తమను కాదని జనసేనకి సీటు ఇచ్చినట్లయితే సహకరించేది లేదని టీడీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. జనసేనకు సీటు ఇచ్చినట్లయితే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను కూడా పంపుతున్నారు.
టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు మొదలు కాకముందే గాజువాకలో రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. జనసేన అధ్యక్షుడికే గాజువాకలో దిక్కులేనపుడు..మామూలు నాయకుడు పటిష్టమైన స్థితిలో ఉన్న వైస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనగలడా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment