Visakhapatnam Elections
-
భీమిలి నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం/తగరపువలస(విశాఖ): వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సభ నిర్వహించనున్నట్లు పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు. సంగివలసలో జాతీయరహదారి పక్కన ఎంపిక చేసిన సభా స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సభాస్థలం, పార్కింగ్, హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్ల గురించి భీమిలి సీఐ డి.రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితులను చేయడమే ఈ సభ ఉద్దేశమని చెప్పారు. ఈ సభలో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేలు చొప్పున 2లక్షల మంది వరకు ప్రజాప్రతినిధులు, గృహ సారథులకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సభలే రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగుచోట్ల నిర్వహిస్తామన్నారు. సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పెన్మత్స సురేష్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, రీజనల్ యూత్ కో–ఆర్డినేటర్ ముత్తంశెట్టి శివనందీష్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె.వెంకటరెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. తొలుత విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, డీసీపీ శ్రీనివాస్, ఏడీసీపీ జాన్ మనోహర్, ఏసీపీ జి.శ్రీనివాసరావు, భీమిలి ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, ట్రాఫిక్ సీఐ ఎస్.కాంతారావు సభా స్థలాన్ని పరిశీలించారు. -
గాజువాకలో టీడీపీ-జనసేన సిగపట్లు!
పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తేనే దిక్కులేదు.. ఇప్పుడు మీరు పోటీ చేసి ఏం గెలుస్తారు? గాజువాకలో జనసేన నేతలపై టీడీపీ నాయకులు సెటైర్లు పేలుస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేశారు కనుక ఈసారి గాజువాక తమకే ఇవ్వాలని జనసేన నేతలు పట్టుపడుతున్నారు. పవన్ గెలవలేనపుడు మీకు సీటు ఎందుకివ్వాలని టీడీపీ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సిగపట్లు మొదలయ్యాయి. ఇంకా రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు మొదలు కాకముందే గాజువాకలో గలాటా మొదలైంది. అసలక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబుకు కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం గాజువాకలో సొంత పార్టీ అభ్యర్థికే చంద్రబాబు ప్రచారం చేయలేదు. పక్క నియోజకవర్గంలో ప్రచారం చేసి పవన్ పోటీ చేస్తున్న గాజువాకలో టీడీపీకి ప్రచారం చేయకుండా వెనుదిరిగారు. గత ఎన్నికల్లో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈసారి గాజువాక తమకే కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు. జనసేన తరఫున పోటీ చేయడానికి కోన తాతారావు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన తరఫున ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోన తాతారావు. గాజువాకలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొదటినుంచి పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నానని అవకాశవాద రాజకీయాల కోసం తానేమి పార్టీలోకి కొత్తగా రాలేదంటున్నారు. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచి పదవులు అనుభవించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా తమ నాయకుడు జనసేనలోకి రాలేదని కోన తాతారావు అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గాజువాకలో పోటీ చేయాల్సిందే అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ క్యాడర్ మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్‌కి మద్దతు తెలిపిందని చెబుతున్నారు. అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన గాజువాక సీటును మళ్లీ ఎందుకు జనసేనకి ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. జనసేనతో పోలిస్తే టీడీపీనే ఇక్కడ బలంగా ఉందంటున్నారు. తమను కాదని జనసేనకి సీటు ఇచ్చినట్లయితే సహకరించేది లేదని టీడీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. జనసేనకు సీటు ఇచ్చినట్లయితే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను కూడా పంపుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు మొదలు కాకముందే గాజువాకలో రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. జనసేన అధ్యక్షుడికే గాజువాకలో దిక్కులేనపుడు..మామూలు నాయకుడు పటిష్టమైన స్థితిలో ఉన్న వైస్ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనగలడా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందో చూడాలి. -
పొత్తులమారి నక్క!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సహచర పక్షాలను మోసగించే ‘పొత్తులమారి నక్క’ తెలుగుదేశం పార్టీ ఎప్పటిలానే ఈసారి జనసేనకు ఝలక్ ఇచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. ఉత్తరాంధ్రలో ఉన్న 35 సీట్లలో కేవలం విశాఖ దక్షిణ, భీమిలి నియోజకవర్గాలతోపాటు పెందుర్తి/యలమంచిలిలో ఏదో ఒక స్థానాన్ని కలిపి మొత్తం మూడు మాత్రమే జనసేనకు కేటాయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అంతర్గతంగా టీడీపీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. సర్వేల సాకుతో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. టీడీపీ ఎత్తులను పసిగట్టిన జనసేన తన బలం పెంచుకునేందుకు కొత్త నేతలకు ఆహ్వానం పలుకుతోంది. పెద్దగా ప్రజాబలం లేకున్నా.. గతంలో ఎన్నడో రాజకీయాలు చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పడాల అరుణను చేర్చుకుంది. తాజాగా అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఆహా్వనిస్తోంది. తమ వద్ద బలమైన నేతలు ఉన్నారని చూపించుకునేందుకు తహతహలాడుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ‘సీట్ల ముడి’ అంత సులువుగా వీడేలా కనిపించడం లేదు. నాలుగు జిల్లాల్లో జనసేనకు ‘సున్న’ం! ఉత్తరాంధ్ర జిల్లాల పునర్విభజన తర్వాత శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఈ ఆరు జిల్లాల్లో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో విశాఖ జిల్లాలో రెండు సీట్లు, అనకాపల్లి జిల్లాలో ఒక్క సీటు మాత్రమే జనసేనకు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. అంటే నాలుగు జిల్లాల్లో జనసేనకు మొండిచేయి చూపనుందన్నమాట. దీంతో జనసేన నేతలు రగిలిపోతున్నారు. వీరందరికీ మొండిచేయేనా..! ♦ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నుంచి విశ్వక్సేన్, పాతపట్నం నుంచి గేదెల చైతన్య జనసేన తరఫున సీట్లను ఆశిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉంది. ♦ విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, గజపతినగరం నుంచి పడాల అరుణ జనసేన తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె జనసేన పొలిటికల్ కమిటీ మెంబర్‌గా కూడా ఉన్నారు. ♦ పార్వతీపురం జిల్లాలో సాలూరు సీటును తమకు కేటాయించాలని జనసేన నేతలు కోరుతున్నారు. ♦అయితే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించే అవకాశం లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ♦ విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ దక్షిణంలో ఏదో ఒక సీటును జనసేన తరఫున వంశీకృష్ణ యాదవ్ ఆశిస్తుండగా.. పెందుర్తి సీటు తనదే అన్న రీతిలో పంచకర్ల రమేష్ బాబు మొన్నటివరకు కార్యక్రమాలు చేశారు. గట్టి హామీ లేకపోవడంతో ఆయన సందిగ్ధంలో పడిపోయారు. ♦ యలమంచిలి నుంచి జనసేన తరఫున సుందరపు విజయ్‌కుమార్ పోటీకి యత్నింస్తున్నారు. అనకాపల్లి నుంచి పరుచూరి భాస్కర్‌రావు రేసులో ఉన్నారు. విశాఖ దక్షిణం నుంచి కందుల నాగరాజు, సాదీక్‌లు, విశాఖ ఉత్తరం నుంచి ఉషాకిరణ్, భీమిలిలో పంచకర్ల సందీప్ జనసేన తరఫున సీటు కోసం యత్నాలు చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు తమకు కచ్చితంగా సీటు వస్తుందని బలంగా నమ్ముతున్న నేతలు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ♦ కొత్తగా చేరుతున్న కొణతాల రామకృష్ణ తనకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని చెబుతున్నా.. ఇప్పటికే టీడీపీ నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న ఒకరికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. -
విశాఖలో బడుగుల విజయవిహారం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం విశాఖ తీరంలో విజయ విహారం చేశారు. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం జగన్ అందించిన పథకాలతో తాము సాధించిన విజయాలను, సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. నెడ్‌క్యాప్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో మాధవధార నుంచి కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ వరకూ వందలాది బైకులు, కార్ల ర్యాలీతో యాత్ర సాగింది. జై జగన్.. జై జై జగన్ అంటూ వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కైలాసపురం వద్ద జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం జనసంద్రమే అయింది. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. పేదల అభ్యున్నతి జగన్‌తోనే సాధ్యం: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పేద ప్రజల అభ్యున్నతి సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారిని సాధికారత దిశగా నడిపించిన సీఎం జగన్ ఒక్కరేనని తెలిపారు. ఈ వర్గాలను చంద్రబాబు ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే భావించారని, అధికారంలోకి వచ్చాక అవహేళన చేశారని అన్నారు. ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు మరో మారు మాయల పకీరులా మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అదే రైతులు, అక్కచెల్లెమ్మలను సీఎం వైఎస్ జగన్ ఆదుకొని, వారి కుటుంబాలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి దేశ చరిత్రలో రికార్డు నెలకొల్పారన్నారు. అసమానతలు రూపుమాపుతున్నసీఎం జగన్ : మంత్రి మేరుగు సీఎం వైఎస్ జగన్ సమాజంలో అసమానతలను రూపుమాపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అందరూ సమానంగా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచనైతే.. దళితులపై దాడులు, బీసీలను తోకలు కత్తిరిస్తానని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆర్ధి కంగా బలోపేతమయ్యాడని చెప్పారు. చంద్రబాబు పాలనలో 12 శాతం ఉన్న పేదరికం సీఎం జగన్ పాలనలో 6 శాతానికి తగ్గిందన్నారు. అంబేడ్కర్ కలలు నిజమవుతున్నాయి: మేయర్ హరి వెంకట కుమారి పేదలు అభ్యున్నతి చెందాలన్న అంబేడ్కర్, జ్యోతిరావు పూలే వంటి మహానుభావులు కన్న కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేస్తున్నారని గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకటకుమారి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అభివృద్ధి చెందిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ వర్గాలకు చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో రాజకీయంగా సముచిత స్థానం కల్పించారన్నారు. నియోజకవర్గంలో రూ.3467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: కె.కె.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రూ.3,467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు తెలిపారు. విశాఖను పారిశ్రామిక, పర్యాటక, విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే అగ్ర నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 17 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఇనార్బిట్‌మాల్, ఐటీ టవర్, మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది పూర్తయితే 2 వేల మందికి ఉద్యోగావకాశాలు, కంచరపాలెం ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ప్రాంతంలో ఎఎస్ఎన్ మెఘా మాల్ ద్వారా 1500 మందికి పైగా ఉపాధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, కంబాల జోగులు, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర గణేష్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంభా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు. -
అలాంటివాళ్లు వెళ్లిపోతేనే మంచిది: ఏపీ మంత్రి అమర్నాథ్
సాక్షి,విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే వారికి మాత్రమే సీట్లు ఇస్తామని, ఈ విషయంలో కాంప్రమైజ్, కన్విన్స్ ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వీరభద్రరావు పార్టీని వీడటంపై గుడివాడ స్పందించారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ ఇప్పటికే పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ‘కొద్ది రోజుల క్రితం కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పేర్లు ప్రకటించారు. అప్పటి నుంచి చర్చ మొదలైంది. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీ లో ఉండొద్దని స్పష్టంగా పార్టీ చెప్పింది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు. టికెట్లు రాని వ్యక్తులు ఎన్నికల వేళ పార్టీ కి దూరంగా ఉండటం వల్ల నష్టం లేదు’ ‘ఏపీలో 175 సీట్లే ఉన్నాయి. అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వ గలరు. దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఆయన వాటిని తిరస్కరించారు. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిది’ అని గుడివాడ స్పష్టం చేశారు. ఇదీచదవండి..బాబు, పవన్‌లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి -
ప్రజలకు చేసిన మంచిని వివరిస్తున్నాం: మంత్రి బొత్స
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్, పూలే ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, సీఎం జగన్ బడుగు బలహీనర్గాలకు చేసిన మంచిని వివరిస్తామని మంత్రి బొత్స అన్నారు. కొన్ని పత్రికలు, టీవీలు యాత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగినట్లు అవినీతి ఈ ప్రభుత్వంలో జరగలేదన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడయితే ఎందుకు జైలులో ఉంటారు.. కన్ను బాగోలేదని బెయిల్ ఇచ్చారు.. మళ్లీ నాలుగు వారాల తరువాత మళ్ళీ జైలుకు రమ్మనారు’’ అని మంత్రి పేర్కొన్నారు ఇది బడుగు బలహీనర్గాల ప్రభుత్వం: రాజన్న దొర డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ, మా ప్రభుత్వం బడుగు బలహీనర్గాల ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను 98 శాతానికి పైగా సీఎం జగన్ అమలు చేశారు.. హామీలు ద్వారా బడుగు బలహీనర్గాలు ఎక్కువ లబ్ది పొందారని మంత్రి అన్నారు. ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది: ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని, ఆరోపణ చేసిన ప్రతిసారి ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నానన్నారు. ‘‘నా పనితనానికి వచ్చే ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది. సభకు వచ్చి జనాలను చూస్తే మాడుగుల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని ముత్యాల నాయుడు అన్నారు. చదవండి: చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు