అచ్చెంనాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? | Special Story On TDP Kinjarapu Atchannaidu | Sakshi
Sakshi News home page

అచ్చెంనాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా?

Published Sun, Jan 28 2024 3:03 PM | Last Updated on Mon, Feb 5 2024 12:37 PM

Special Story On TDP Kinjarapu Atchannaidu - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఏం చేస్తున్నారు? ఎన్నిక‌ల త‌రుణంలో బిజీగా క‌నిపించాల్సిన అచ్చెంనాయుడు అసలు కనిపించడంలేదు ఎందుకని?  ఆయ‌నే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా?  లేక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అచ్చెన్నను పక్కన పెట్టేశారా? అనే ప్రశ్నలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో టికెట్ కావ‌ల‌సిన వాళ్లు  బాబు, లోకేష్ ల వెంట‌ప‌డుతున్నారేగాని అచ్చెన్న దగ్గరకు ఎందుకు వెళ్లడం ళ్లేదు? 

పార్టీ అధ్యక్షుడు  అచ్చెంనాయుడిపై  చంద్రబాబు నాయుడికి చాలా మంట‌గా ఉందంటున్నారు. బాబు కే కాదు  ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్  కూడా అచ్చెన్నపై    పీక‌ల‌దాకా కోపంతో ఉన్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ  కూడా  ఏడాదిగా అచ్చెన్నపై ఆగ్రహంతోనే   ఉన్నార‌ని  పార్టీ వ‌ర్గాలంటున్నాయి. స‌రియైన స‌మ‌యం  కోస‌మే  బాబు ఇంత‌కాలం ఓపిగ్గా  ఉండిపోయార‌ని వారంటున్నారు. ఇపుడు ఎన్నిక‌లు త‌రుముకు వ‌స్తోన్న త‌రుణంలో దీన్ని మించిన అద‌ను మ‌ళ్లీ దొర‌క‌ద‌నుకుంటోన్న బాబు, లోకేష్ ఇద్దరూ  కూడా అచ్చెన్నను  సైడ్ లైన్ చేశార‌ని అంటున్నారు. మును ముందు అచ్చెన్న ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉండే ప‌రిస్థితులు ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాల్లో  వినిపిస్తోంది.

అచ్చెన్నాయుడిపై  పార్టీ అధినేత‌కు  కోపం రావ‌డానికి కార‌ణం లేక‌పోలేదు.2019 లో టీడీపీ దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకున్నాక కొంత గ్యాప్ త‌ర్వాత  బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన అచ్చెంనాయుణ్ని ఏపీ అధ్యక్షునిగా నియ‌మించారు. అయితే  స్థానిక సంస్థలఎన్నిక‌ల్లో టీడీపీ వ‌రుస ప‌రాజ‌యాలు మూట‌క‌ట్టుకోవ‌డంతో పార్టీలో నిస్తేజం  ఆవ‌రించింది. ఆ త‌రుణంలోనే  తిరుప‌తి లోక్ స‌భ స్థానానికి ఉప ఎన్నిక వ‌చ్చింది. ఎన్నిక‌ల్లో పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశ‌నం చేసేందుకు వ‌చ్చిన అచ్చెంనాయుడు ఓ హోట‌ల్ లో పార్టీ  నేత ఒక‌రితో మాట్లాడుతూ టీడీపీ ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంద‌న్నారు. పార్టీ లేదు బొక్కా లేద‌న్నారు. లోకేష్ నాయ‌క‌త్వంలో పార్టీ స‌ర్వనాశ‌నం కావ‌డం ఖాయ‌మ‌న్న అర్ధం వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యల‌న్నీ ర‌హ‌స్యంగా రికార్డు అయిపోయాయి. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ దృశ్యాల‌ను పాల‌క ప‌క్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ.. దాని అనుకూల మీడియా బాగా వాడేశాయి. దీంతో  లోకేష్ ప‌రువు కాస్తా పోయింది. త‌న‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడిపై లోకేష్ కు మండుకొచ్చింది. అటు చంద్ర‌బాబు నాయుడు సైతం త‌న కుమారుడి గాలి తీసేలా..పార్టీ ప‌రువు పోయేలా అచ్చెన్నాయుడు మాట్లాడ్డాన్ని జీర్ణించుకోలేక‌పోయారు. అప్పుడు అచ్చెన్నపై  క‌ఠిన చర్యలు  తీసుకోవాల‌ని అనుకున్నా  అది స‌రియైన స‌మ‌యం కాద‌నుకున్నారు బాబు. అస‌లే  పార్టీ శ్రేణులు నిరాశ‌లో ఉన్న స‌మ‌యంలో పార్టీ అధ్యక్షుడిపై  వేటు వేస్తే   ప్రజల్లోకి ..పార్టీ కార్యకర్తల్లోకి  త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌న్న భ‌యంతోనే బాబు  పంటి బిగువున   కోపాన్ని అణ‌చి పెట్టుకున్నారు.


ఈ ఘ‌ట‌న త‌ర్వాత కూడా అచ్చెంనాయుడి వైఖ‌రి బాబుకు నచ్చలేద‌ని అంటున్నారు. లోకేష్ యువ‌గ‌ళం యాత్ర సంద‌ర్భంగా చిత్తూరు జిల్లాలో జ‌నం ఎక్కువ‌గా రావ‌డం లేద‌ని స్థానిక నేత‌ల‌కు ఫోన్ చేసిన అచ్చెంనాయుడు లోకేష్ స‌భ‌ల‌కు జ‌నం రావ‌డం లేద‌ని బాబు  బాధ ప‌డుతున్నార‌ని ..తక్షణమే  లోకేష్ యాత్రకు జ‌నాన్ని త‌ర‌లించాల‌ని ఫోనులో ఆదేశించారు. అయితే ఈ ఫోను సంభాష‌ణ కూడా లీక్ అయ్యింది. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది. దాంతో లోకేష్ యాత్ర అట్టర్ ఫ్లాప్ అన్న ప్రచారం పెరిగింది. ఆ త‌ర్వాత స్కిల్ స్కాంలో బాబు  అరెస్ట్ అయిన సంద‌ర్భంలోనూ బాబుతో నేను కర్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు  పాల్గొనాల‌న్న అచ్చెన్న.. పార్టీలో నేత‌లెవ్వరూ స్పందించ‌డం లేదంటూ   లేఖ రాశారు. ఆ లేఖ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.


ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడి వైఖ‌రిపై బాబుకు అనుమానాలు పెరిగాయి. చంద్రబాబు నాయుడు 2014లో విభ‌జిత ఏపీకి సిఎం అయిన త‌ర్వాత కేబినెట్ లో అచ్చెన్నాయుడికి కీల‌క ప‌ద‌వే ఇచ్చారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి కావ‌డం..వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో స‌మీక‌ర‌ణ‌లు మారాయి. ప్రత్యేకించి  అచ్చెన్నాయుడు  పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని  ఆయ‌న‌పై ఈ.ఎస్.ఐ. స్కాం లో కేసు న‌మోద‌య్యింది. అందులో అచ్చెన్న  అవినీతికి ఆధారాలు ఉన్నాయ‌ని ఏసీబీ అంటోంది. అయితే ఈ కేసుల భ‌యానికే అచ్చెన్నాయుడు పాల‌క వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారేమోన‌ని బాబు అనుమానిస్తున్నార‌ట‌.


అస‌లు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో   అచ్చెన్న చేర‌తార‌న్న ప్రచారమూ జ‌రిగింది. అయితే  పార్టీలో చేర్చుకోవ‌ల‌సి వ‌స్తే అచ్చెన్న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేయ‌కుండా పార్టీలో చేర్చుకోకూడ‌ద‌న్న‌ది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫిలాస‌ఫీ. అందుకే ఆయ‌న టీడీపీలోనే ఉంటూ వైసీపీకి అనుకూలంగా పావులు క‌దుపుతున్నారేమో అన్న అనుమానాలూ  పెరుగుతున్నాయి. 

అందుకే చంద్రబాబు నాయుడు చాలా కాలంగా అచ్చెన్నపై నిఘా పెట్టార‌ని అంటున్నారు. అచ్చెంనాయుడు ఉద్దేశ పూర్వకంగానే  పార్టీ ప‌రిస్థితి బ‌ల‌హీనంగా ఉంద‌ని  ప్రచారం చేయిస్తున్నార‌ని చంద్రబాబు భావించారు. అచ్చెన్నాయుడి వ్యవహారాలు  పాల‌క వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా  మారాయి. పార్టీ ప‌రువుతో పాటు లోకేష్ ప్రతిష్ఠనూ  మంట‌గ‌లుపుతున్నార‌ని  అనిపించ‌గానే చంద్రబాబు అచ్చెంనాయుణ్ని హిట్ లిస్ట్ లో పెట్టేశారు.

అయితే స‌మ‌యం కోసం వేచి ఉన్నారు. ఎన్నిక‌లు దగ్గర ప‌డ‌గానే అచ్చెంనాయుడి ప్రాధాన్యత త‌గ్గించేశారు. ఉత్తరాంధ్రలోనూ  పార్టీ నేత‌లు అచ్చెన్నాయుణ్ని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఎన్నిక‌ల త‌ర్వాత అచ్చెంనాయుడి చాప్టర్  క్లోజ్ అయిన‌ట్లే అన్న  గుస గుస‌లు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement